Mamata Banerjee: సుప్రీంకు చేరిన ఈడీ - దీదీ పంచాయితీ

Mamata Banerjee ED face off reaches Supreme Court
  • బొగ్గు స్కామ్‌ దర్యాప్తు సోదాలు, ఆధారాల సేకరణను సీఎం మమతా బెనర్జీ సర్కార్ అడ్డుకుంటుందన్న ఈడీ
  • తమ ఎన్నికల వ్యూహాలను దోచుకునేందుకే ఈడీ ఈ దాడులు చేపట్టిందన్న టీఎంసీ
  • సీబీఐ విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన ఈడీ
  • కెవియెట్ పిటిషన్ దాఖలు చేసిన దీదీ సర్కార్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మధ్య తలెత్తిన వివాదం కలకత్తా హైకోర్టులో రసాభాసగా మారిన నేపథ్యంలో ఇరుపక్షాలూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

బొగ్గు స్కామ్ దర్యాప్తులో భాగంగా చేపట్టిన సోదాలు, ఆధారాల సేకరణను సీఎం మమతా బెనర్జీ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అడ్డుకున్నారని ఈడీ తన పిటిషన్‌లో ఆరోపించింది. మరో నాలుగు నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార టీఎంసీ పార్టీ ఎన్నికల వ్యూహాల కోసం పనిచేస్తున్న ఐ-ప్యాక్ సంస్థ కార్యాలయం, ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంట్లో గురువారం ఈడీ సోదాలు నిర్వహించడం తీవ్ర కలకలాన్ని రేపింది. అయితే తమ ఎన్నికల వ్యూహాలను దోచుకునేందుకే ఈడీ ఈ దాడులు చేపట్టిందని టీఎంసీ ఆరోపించింది. ఈడీ చర్యలకు నిరసనగా మమతా బెనర్జీ భారీ ప్రదర్శన కూడా నిర్వహించారు.

సోదాల సమయంలో జరిగిన వరుస ఘటనలను ఈడీ తన పిటిషన్‌లో వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ‘బలప్రదర్శన’గా అభివర్ణిస్తూ, పోలీసులు సహా రాష్ట్ర అధికారులు జోక్యం చేసుకోవడం వల్ల బొగ్గు స్మగ్లింగ్ కేసు దర్యాప్తు సమగ్రత దెబ్బతిన్నట్టేనని పేర్కొంది. స్వేచ్ఛాయుతంగా, స్వతంత్రంగా దర్యాప్తు జరిపే తమ హక్కును రాష్ట్ర యంత్రాంగం హరించిందని ఆక్షేపించింది. ఈ ఘటనలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది.

బొగ్గు స్కామ్‌కు సంబంధించిన రూ.20 కోట్లను హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్‌కు మళ్లించినట్టు కీలక ఆధారాలు లభించాయని ఈడీ తెలిపింది. అయితే సోదాల సమయంలో ప్రతీక్ జైన్ ఇంట్లోకి మమత ప్రవేశించి కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను లాక్కెళ్లారని ఆరోపించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద జరుగుతున్న సోదాల్లో జోక్యం చేసుకోవద్దని కోరినప్పటికీ, మమత పోలీసుల సాయంతో బలవంతంగా ఆధారాలను తీసుకెళ్లారని పేర్కొంది. ఐదుగురు సాక్షులను కూడా ‘సమర్థవంతంగా హైజాక్’ చేశారని ఆరోపించింది. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ పరికరాలను వినియోగించకుండా, తొలగించకుండా లేదా మార్పుచేర్పులు చేయకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని ఈడీ కోరింది.

ఇదే సమయంలో, తమ వాదన వినకుండా ఎలాంటి ఆదేశాలూ జారీ చేయవద్దని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియెట్ దాఖలు చేసింది. కోల్‌కతాలోని ప్రతీక్ జైన్ నివాసం, నగర శివారులోని మరో కార్యాలయంలో ఈడీ సోదాలను వ్యతిరేకిస్తూ మమతా బెనర్జీ శుక్రవారమే రెండు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. తమ పార్టీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ చోరీ చేసిందని ఆమె ఆరోపించారు. ఆ ఫిర్యాదుల ఆధారంగా కోల్‌కతా, బిధన్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా, వాటిపై పోలీసులు నిన్న దర్యాప్తు ప్రారంభించారు. ఇరువర్గాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఎటువంటి ఉత్తర్వులు వెలువడతాయనేది ఆసక్తికరంగా మారింది. 
Mamata Banerjee
West Bengal
ED
Coal Scam
I-PAC
Prateek Jain
Supreme Court
TMC
Enforcement Directorate
Money Laundering

More Telugu News