Hyderabad: హైదరాబాద్‌లో పశువైద్యుల అద్భుతం.. చేప చర్మంతో శునకానికి పునర్జన్మ

Dog Reborn with Fish Skin Graft in Hyderabad Veterinary Miracle
  • హైదరాబాద్‌లో శునకానికి అరుదైన శస్త్రచికిత్స
  • తీవ్ర ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న కుక్కకు చేప చర్మం అంటుకట్టు
  • ప్రాణాపాయ స్థితి నుంచి మూగజీవాన్ని కాపాడిన వైద్యులు
  • పశువైద్య రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పన్న నిపుణులు
పశువైద్య రంగంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ శునకానికి, ప్రత్యేకంగా ప్రాసెస్ చేసిన చేప చర్మాన్ని అంటుకట్టి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది.

వివరాల్లోకి వెళితే... బోడుప్పల్‌కు చెందిన ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతుండటంతో పెట్స్ కేర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు, శునకం శరీరంపై సుమారు 50 శాతం చర్మం ఇన్‌ఫెక్షన్ కారణంగా పూర్తిగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో సాధారణ చికిత్సకు బదులుగా అధునాతన రీజెనరేటివ్ మెడిసిన్ పద్ధతి ద్వారా చికిత్స చేయాలని నిర్ణయించారు.

ఈ విధానంలో భాగంగా శునకానికి చేప చర్మాన్ని గ్రాఫ్టింగ్‌గా అమర్చారు. చేప చర్మంలో సహజంగా ఉండే కొల్లాజెన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గాయం త్వరగా మానడానికి అద్భుతంగా సహకరిస్తాయని డాక్టర్ వెంకట్ వివరించారు. ఈ చర్మం ఒక సహజ కవచంలా పనిచేసి, ఇన్ఫెక్షన్లను అడ్డుకుంటుంది. అంతేకాకుండా ఇది నొప్పిని తగ్గించి, జంతువు శరీరం లోపల కొత్త చర్మం వేగంగా ఏర్పడటానికి సహాయపడుతుందని ఆయన తెలిపారు.

ఈ శస్త్రచికిత్స పశువైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పు అని ప్రభుత్వ వెటర్నరీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మణ్, డాక్టర్ షిరీన్ ప్రశంసించారు. సాధారణంగా మనుషుల్లో కాలిన గాయాలకు ఇలాంటి ప్రయోగాలు జరుగుతాయని, మూగజీవాలపై చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో క్లిష్టమైన చర్మ సమస్యలతో బాధపడే జంతువులకు ఈ చికిత్స తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు ఇస్తుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Hyderabad
Dog
Dog skin infection
Fish skin graft
Veterinary surgery
Pets Care Super Speciality Hospital
Dr Venkat
Animal health
Regenerative medicine
Collagen

More Telugu News