ఇరాన్‌లో ఆగని నిరసన జ్వాలలు.. వారు 'దేవుడి శత్రువులు' అంటూ ప్రభుత్వం హెచ్చరిక!

  • ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలపై ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసనలు
  • ఇప్పటివరకు కనీసం 72 మంది నిరసనకారులు మృతి
  • పోలీసుల అదుపులో 2,300 మంది 
  • దేవుడి శత్రువులుగా పరిగణించి మరణశిక్ష విధిస్తామన్న ఇరాన్ అటార్నీ జనరల్ 
  • ఇరాన్ స్వేచ్ఛవైపు చూస్తోందన్న డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌లో ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. ఇంటర్నెట్ షట్‌డౌన్, కఠినమైన అణచివేత చర్యలు ఉన్నప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా శనివారం నాటి ప్రకటనతో ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై యుద్ధం ప్రకటించినట్లయింది.

నిరసనకారులను ఏమాత్రం ఉపేక్షించవద్దని, వారిపై కఠినమైన అభియోగాలు మోపాలని ఇరాన్ అటార్నీ జనరల్ మహ్మద్ మొవాహెదీ ఆజాద్ ప్రాసిక్యూటర్లను ఆదేశించారు. నిరసనల్లో పాల్గొన్న వారే కాకుండా, వారికి సహాయం చేసే వారిని కూడా 'మొహారెబ్' (దేవుడి శత్రువులు) గా పరిగణిస్తామని, దీనికి ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మరోవైపు, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తూ అణచివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నిరసనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "అమెరికా పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. శాంతియుత నిరసనకారులను చంపితే తీవ్ర పరిణామాలు ఉంటాయి" అని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు బహిష్కృత యువరాజు రెజా పహ్లావి కూడా శని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలని, ప్రభుత్వ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి సమ్మెలు చేపట్టాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ఇరాన్ ప్రపంచంతో సంబంధాలు లేకుండా డిజిటల్ చీకట్లో ఉంది. గురువారం నుంచే ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ముసుగులో భద్రతా దళాలు భారీగా హింసకు పాల్పడే అవకాశం ఉందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రియన్, టర్కిష్ వంటి విదేశీ విమాన సంస్థలు ఇరాన్‌కు తమ విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. 


More Telugu News