రవితేజ, నవీన్ పోలిశెట్టి సినిమాల టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- జనవరి 13న విడుదల కానున్న రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'
- జనవరి 14 రిలీజ్ అవుతున్న నవీన్ 'అనగనగా ఒక రాజు'
- 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్
ఇప్పటికే ప్రభాస్ 'ది రాజా సాబ్', చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రాలకు టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలు, అదనపు షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (జనవరి 13 విడుదల), నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' (జనవరి 14 విడుదల) చిత్రాలకు కూడా ఈ సౌలభ్యం కల్పించింది. మెమో జారీ చేసి, టికెట్ ధరలు పెంపునకు అధికారికంగా అనుమతి ఇచ్చింది.
ఈ రెండు సినిమాలకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధర రూ.50 (జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.75 (జీఎస్టీతో కలిపి) పెంచుకునే వెసులుబాటు ఇచ్చారు. ఈ పెంచిన ధరలు రిలీజ్ నుంచి 10 రోజుల పాటు అమలులో ఉంటాయి. అదనంగా ఎక్స్ ట్రా షోలు కూడా రన్ చేసే అవకాశం ఉంది.
'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో రవితేజతో కలిసి డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ నటిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి ఫన్, ఎమోషన్స్ మిక్స్‌గా రానుంది.
'అనగనగా ఒక రాజు'లో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జోడీగా కనిపిస్తున్నారు. మారి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ-థ్రిల్లర్ యూత్‌ను ఆకర్షించేలా ఉంటుంది.