అమెరికా నుంచి స్వస్థలానికి చేరుకున్న స్నేహితురాళ్ల మృతదేహాలు... ఇద్దరి అంత్యక్రియలు ఒకేచోట!

  • డిసెంబర్ 29న కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మేఘన, భావన మృతి
  • 14 రోజుల నిరీక్షణ తర్వాత ఇళ్లకు చేరుకున్న పార్థివదేహాలు
  • చిన్ననాటి స్నేహితులైన ఇద్దరి అంత్యక్రియలు ఒకేచోట నిర్వహించాలని నిర్ణయం
  • శోకసంద్రంలో మునిగిన గార్ల మండలంలోని రెండు గ్రామాలు
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మహబూబాబాద్ యువతుల మృతదేహాలు ఎట్టకేలకు స్వగ్రామాలకు చేరుకున్నాయి. 14 రోజుల నిరీక్షణ తర్వాత వారి పార్థివదేహాలు ఇళ్లకు చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాదంతో గార్ల మండలంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్ల ఖండం గ్రామవాసి మేఘన (25), ముల్కనూరు గ్రామవాసి కడియాల భావన (25) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఉన్నత చదువుల కోసం ఇద్దరూ కలిసి అమెరికా వెళ్లారు. అయితే, డిసెంబర్ 29న కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్లలో మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తుండగా, భావన తండ్రి కోటేశ్వరరావు ముల్కనూరు గ్రామ ఉప సర్పంచ్‌గా ఉన్నారు.

ఉన్నత భవిష్యత్తుతో తిరిగి వస్తారనుకున్న తమ కుమార్తెలు విగతజీవులుగా మారడంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. స్నేహానికి ప్రతీకగా నిలిచిన ఆ ఇద్దరి అంత్యక్రియలను ముల్కనూరు గ్రామంలోనే కలిపి నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఈ హృదయ విదారక ఘటనతో ఇరు గ్రామాల్లో విషాదం నెలకొంది.




More Telugu News