టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంపై గిల్ ఏమన్నాడంటే?

  • టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం కోల్పోవడంపై స్పందించిన శుభ్‌మన్ గిల్
  • సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు వెల్లడి
  • తలరాతలో ఉన్నదే జరుగుతుందని వ్యాఖ్య
  • పొట్టి ఫార్మాట్‌లో ఫామ్ లేమి కారణంగా గిల్‌కు దక్కని చోటు
  • జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పిన భారత వన్డే కెప్టెన్
భారత వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, త్వ‌ర‌లో జరగనున్న 2026 టీ20 ప్రపంచకప్ జట్టులో తనను ఎంపిక చేయకపోవడంపై తొలిసారి స్పందించాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరగనున్న తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ, సెలక్టర్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు తెలిపాడు.

ఇటీవ‌ల కాలంలో పొట్టి ఫార్మాట్‌లో గిల్ ఫామ్ ఆశించిన స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో జట్టు కూర్పును దృష్టిలో ఉంచుకుని సెలక్షన్ కమిటీ అతడిని పక్కనపెట్టింది. టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా, వైస్ కెప్టెన్‌గా గిల్ స్థానంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించారు.

ఈ విషయంపై గిల్ మాట్లాడుతూ.. "సెలక్టర్ల నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న జట్టుకు నా శుభాకాంక్షలు. నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. నా తలరాతలో ఏది రాసి ఉందో దాన్ని ఎవరూ తీసివేయలేరు. దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రతి ఆటగాడు ప్రయత్నిస్తాడు. సెలక్టర్లు తమ నిర్ణయం తీసుకున్నారు" అని గిల్ చెప్పుకొచ్చాడు.


More Telugu News