Vijay: నటుడు విజయ్‌కు సీబీఐ సమన్లు.. ప్రచార వాహనం సీజ్

Vijay CBI Summons Issued After Karur Stampede Vehicle Seized
  • కరూర్ సభలో తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం
  • నటుడు విజయ్‌కు సమన్లు జారీ.. 12న ఢిల్లీలో విచారణ
  • విజయ్ ప్రచార వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు
  • ఇప్పటికే పలువురు టీవీకే నేతలు, జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించిన సీబీఐ
తమిళ సినీ నటుడు, రాజకీయ నేత విజయ్ చుట్టూ కరూర్ తొక్కిసలాట కేసులో ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల‌ 12న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆయనకు సమన్లు జారీ చేసింది. గతేడాది జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది మృతి చెందిన నేపథ్యంలో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది.

ఈ కేసులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును కూడా సీబీఐ అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. సభ జరిగిన రోజు వాహనం ప్రయాణ వివరాలు, అనుమతులు, సమయపాలన వంటి అంశాలను నిర్ధారించుకునేందుకు వాహనాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ను కూడా ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు.

గతేడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) నిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా జనం తరలిరావడం, జన నియంత్రణ ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా తీవ్ర తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిష్పక్షపాత విచారణ కోసం ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది.

అప్పటి నుంచి దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ, నవంబర్ 25న పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, ఇతర ముఖ్య నేతలను విచారించింది. డిసెంబర్ 4న కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేలంను కూడా రెండు గంటల పాటు ప్రశ్నించి, సభకు ఇచ్చిన అనుమతులపై ఆరా తీసింది. ఇప్పుడు నేరుగా విజయ్‌ను విచారించడం ద్వారా సభ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కీలక సమాచారం రాబట్టి, బాధ్యులను గుర్తించాలని సీబీఐ భావిస్తోంది.
Vijay
Actor Vijay
Tamil Nadu Politics
Karur Stampede
CBI Investigation
Tamilaga Vettri Kazhagam
TVK Party
Bussy Anand
Thangavelam
Tamil Nadu

More Telugu News