Chinmayi: ఇలాంటి ప్రవర్తనను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా?: సింగర్ చిన్మయి
- మహిళల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యలు వివాదాస్పదం
- ఓ టీవీ డిబేట్ లో కాంగ్రెస్ నాయకురాలి వ్యాఖ్యలపై చిన్మయి విమర్శలు
- డిబేట్ లో అసభ్య పదజాలం మీడియా స్థాయిని దిగజార్చిందని వ్యాఖ్య
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, సమాజానికి సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలను ఎలాంటి భయం లేకుండా స్పష్టంగా చెప్పే వ్యక్తిగా సింగర్ చిన్మయికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా మహిళల హక్కులు, లైంగిక వేధింపులపై చిన్మయి చేసే వ్యాఖ్యలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి.
ఇక, ఇటీవల ‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చిన్మయి తీవ్రంగా స్పందించగా, అనసూయ కూడా అదే స్థాయిలో శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేసింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరి, సినీ వర్గాలకే కాదు రాజకీయ వర్గాలకూ విస్తరించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో ఓ టీవీ డిబేట్‌లో కాంగ్రెస్‌కు చెందిన మహిళా నాయకురాలు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. దీనిపై తాజాగా చిన్మయి ఘాటు ట్వీట్ చేస్తూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘‘టెలివిజన్ చర్చల్లో ఇలాంటి ప్రవర్తనను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా? లేక ఈ తరహా ఆలోచనలకు పార్టీ ఉన్నత నాయకత్వం మద్దతు ఇస్తుందా?’’ అంటూ ఆమె ప్రశ్నించింది. ఓ సినిమా ఈవెంట్‌లో నటుడు తన సహనటిపై బూతులు తిట్టిన ఘటన తర్వాత, మహిళల దుస్తులు, నైతికతపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద చర్చ మొదలైందని ఆమె గుర్తు చేసింది. దీనిని కొందరు ‘ఆందోళన’గా చిత్రీకరించడాన్ని కూడా ఆమె తప్పుబట్టింది.
టీవీ ఛానెళ్లలో జరిగిన చర్చల్లో వినిపించిన అసభ్య పదజాలం మీడియా స్థాయిని దిగజార్చిందని చిన్మయి విమర్శించింది. మహిళల దుస్తులపై ఆంక్షలు విధిస్తే లైంగిక వేధింపులు ఆగిపోతాయన్న భావన పూర్తిగా తప్పని అనేక మంది మహిళలు చెబుతున్నా, వాటిని పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొంది. డిబేట్‌లో పాల్గొన్న వ్యక్తి మహిళా కాంగ్రెస్ నాయకురాలేనన్న విషయం మరింత ఆందోళన కలిగిస్తోందని ఆమె వ్యాఖ్యానించింది.
‘‘పురుషులు తమను తాము నియంత్రించుకోలేరన్న భావనను బలపరుస్తూ, మహిళల దుస్తులే అత్యాచారాలకు కారణమన్న తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది మహిళలపై మాత్రమే కాదు, పిల్లలు, వృద్ధులు, మరణించినవారిపై జరిగిన లైంగిక హింసను కూడా పరోక్షంగా సమర్థించినట్లే’’ అంటూ చిన్మయి తీవ్రంగా మండిపడింది.