Rohit Sharma: రోహిత్ శర్మ నాకు ఎప్పటికీ కెప్టెనే: జై షా
- రోహిత్ రెండు ఐసీసీ ట్రోఫీలు తెచ్చాడన్న జై షా
- 2023లో మనసులు గెలిచాం కానీ.. ట్రోఫీ రాలేదని వ్యాఖ్య
- 2024లో తాను చెప్పిన మాటలు నిజమయ్యాయన్న జై షా
రోహిత్ శర్మ తనకు ఎప్పటికీ కెప్టెన్ గానే ఉంటాడని ఐసీసీ ఛైర్మన్ జై షా అన్నారు. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "మా కెప్టెన్ ఇక్కడ కూర్కొని ఉన్నాడు. నేను ఆయనను ఎప్పటికీ కెప్టెన్ అనే పిలుస్తాను. ఎందుకంటే రోహిత్ రెండు ఐసీసీ ట్రోఫీలు (2024 టీ20 వరల్డ్ కప్, 2025 చాంపియన్స్ ట్రోఫీ) తీసుకొచ్చాడు"అని కొనియాడారు.
ఆ మాటలు వినగానే రోహిత్ ఆనందం పట్టలేక, పెద్దగా నవ్వేశాడు. అతని భార్య రితికా కూడా చాలా హ్యాపీ ఫీలయింది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో 10 మ్యాచ్‌లు గెలిచి మనసులు గెలిచాం కానీ... ట్రోఫీ రాలేదు అని జై షా చెప్పారు. మనం ప్రపంచ కప్ గెలుస్తామని 2024లో రాజ్‌కోట్‌లో తాను చెప్పిన మాటలు నిజమయ్యాయని... హృదయాలతో పాటు కప్ కూడా గెలిచాం అని గర్వంగా చెప్పారు. ప్రస్తుతం రోహిత్ టీ20, టెస్ట్‌లకు వీడ్కోలు చెప్పి, కేవలం వన్డేల్లోనే ఆడుతున్న సంగతి తెలిసిందే.