Guntur Student: అమెరికాలో కనిపించకుండా పోయిన గుంటూరు యువకుడు

Andhra Pradesh student Harikrishna Reddy missing in Alaska during holiday trip
  • టెక్సాస్ లోని హ్యూస్టన్ యూనివర్సిటీలో చదువు
  • గత నెల 22న అలస్కాకు విహారయాత్రకు వెళ్లిన యువకుడు
  • చివరిసారి గత నెల 30న స్నేహితులకు ఫోన్ కాల్
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన గుంటూరుకు చెందిన 24 ఏళ్ల యువకుడు కనిపించకుండా పోయాడు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా విహారయాత్రకు వెళుతున్నానని చెప్పి అలస్కా వెళ్లిన ఆ యువకుడు అక్కడ గల్లంతయ్యాడని సమాచారం. అమెరికా పోలీసులు, రూమ్మేట్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరుకు చెందిన కారసాని హరికృష్ణారెడ్డి ఎమ్మెస్ చదవడానికి అమెరికా వెళ్లాడు. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. ఈ క్రమంలో క్రిస్మస్ సెలవులలో విహారయాత్రకు వెళ్లి వస్తానని చెప్పి గత నెల 22న అలస్కా వెళ్లాడు.

డెనాలీలోని ఓ హోటల్ లో దిగానని, రెండు వారాలు అక్కడే గడిపి జనవరి 3న తిరిగి వస్తానని హరికృష్ణ చెప్పినట్లు రూమ్మేట్స్ తెలిపారు. డిసెంబర్ 30న తమకు చివరిసారి ఫోన్ చేశాడని, ఆ తర్వాత హరికృష్ణ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని వివరించారు. నెట్ వర్క్ లేకపోవడంతో స్విచ్ఛాఫ్ వస్తోందని భావించామని, జనవరి 3 తర్వాత కూడా రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించామని చెప్పారు. హరికృష్ణకు డ్రైవింగ్ కూడా రాదని, ఎక్కడికి వెళ్లాలన్నా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పైనే ఆధారపడతాడని చెప్పారు.

కాగా, అలస్కాలో ప్రస్తుతం విపరీతమైన మంచు కురుస్తోందని, వాతావరణం ఊహకందని రీతిలో ఎప్పటికప్పుడు మారిపోతుందని పోలీసులు తెలిపారు. మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల వాతావరణం ఉంటుందన్నారు. ఈ సమయంలో అలస్కాలో ఎవరూ పర్యటించరని, హరికృష్ణ ఈ సమయంలోనే అలస్కాకు ఎందుకు వెళ్లాడనేది అంతుచిక్కడం లేదన్నారు. డిసెంబర్ 31న హోటల్ నుంచి బయటకు వెళుతుండగా హరికృష్ణను చూశామని, ఆ తర్వాత అతను తిరిగి రాలేదని హోటల్ సిబ్బంది చెప్పారన్నారు. హరికృష్ణ ఆచూకీ కోసం డెనాలీలో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వివరించారు.
Guntur Student
Indian student missing
USA
America
missing
Alaska
Denali
United States
University of Houston
Telangana news
US news
Harikrishna Reddy

More Telugu News