Jemimah Rodrigues: లిటిల్ మాస్టర్ ‘స్పెషల్’ గిఫ్ట్: జెమీమాకు బ్యాట్ ఆకారపు గిటార్‌ బహుమతిగా ఇచ్చిన గవాస్కర్

Jemimah Rodrigues Receives Special Guitar Gift From Sunil Gavaskar
  • వరల్డ్ కప్ సందర్భంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సునీల్ గవాస్కర్
  • ముంబైలో ఇద్దరూ కలిసి ‘యే దోస్తీ..’ పాటతో సందడి 
  • డబ్ల్యూపీఎల్ 2026కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా జెమీమా నియామకం
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన ఉదారతతో మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నారు. టీమిండియా మహిళా క్రికెట్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్‌కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అరుదైన ‘బ్యాట్’ ఆకారపు గిటార్‌ను ఆమెకు బహుమతిగా అందించారు. శుక్రవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి పాటలు పాడుతూ సందడి చేశారు. క్రీడలు, సంగీతం కలగలిసిన ఈ అపురూప దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గతేడాది భారత్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లో జెమీమా 127 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును ఫైనల్‌కు చేర్చింది. ఆ సమయంలో టీమిండియా కనుక కప్పు గెలిస్తే.. జెమీమా గిటార్ వాయిస్తుంటే తాను పాట పాడుతానని గవాస్కర్ వాగ్దానం చేశారు. నవంబర్ 2న దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత జెమీమా తన సోషల్ మీడియా వేదికగా "సన్నీ సార్.. నేను గిటార్‌తో రెడీ, మీరు మైక్‌తో సిద్ధమేనా?" అంటూ గవాస్కర్‌కు గుర్తుచేసింది.

    
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 ప్రారంభానికి ముందు జరిగిన ఈ భేటీలో గవాస్కర్ స్వయంగా జెమీమా వద్దకు వెళ్లి ఈ ప్రత్యేకమైన గిటార్‌ను అందజేశారు. అనంతరం వీరిద్దరూ కలిసి షోలే సినిమాలోని ప్రసిద్ధ ‘యే దోస్తీ హమ్ నహీ తోడేంగే’ పాట పాడి అలరించారు. "సన్నీ సార్ తన ప్రామిస్ నిలబెట్టుకున్నారు. అత్యంత అద్భుతమైన గిటార్‌తో మేము సరదాగా గడిపాం" అని జెమీమా ఇన్ స్టాగ్రామ్‌లో పేర్కొంది.

మరోవైపు, డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లో జెమీమా రోడ్రిగ్స్ కొత్త అవతారంలో కనిపించనుంది. మెగ్ లాన్నింగ్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆమెను కెప్టెన్‌గా నియమించింది. శనివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో కెప్టెన్‌గా జెమీమా ప్రయాణం మొదలుకానుంది.
Jemimah Rodrigues
Sunil Gavaskar
Womens Premier League
WPL 2026
Delhi Capitals
Mumbai Indians
Cricket
Guitar gift
Indian Cricket
Womens Cricket

More Telugu News