Varshini: లెక్చరర్లు తిట్టడంతో ఇంటర్ విద్యార్థినికి బ్రెయిన్ స్ట్రోక్.. చికిత్స పొందుతూ మృతి

Varshini student death due to lecturer harassment in Hyderabad
  • పరీక్షకు ఆలస్యంగా వచ్చిందని అసభ్య పదజాలంతో దూషించిన అధ్యాపకులు
  • తీవ్ర మానసిక ఒత్తిడికి గురై స్పృహ తప్పి పడిపోయిన బాలిక
  • మెదడులో రక్తం గడ్డకట్టడంతో మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు
  • కళాశాల ఎదుట విద్యార్థులు, కుటుంబ సభ్యుల ఆందోళన
పరీక్షకు ఆలస్యంగా వచ్చిందన్న కారణంతో లెక్చరర్లు చేసిన అవమానం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని ఎం.ఆర్.ఎం.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వర్షిణి అధ్యాపకుల వేధింపులతో మనస్తాపానికి గురైంది. ఈ ఒత్తిడి కారణంగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై మరణించింది. మల్కాజిగిరికి చెందిన కార్పెంటర్ నర్సింగ్‌ రావు కుమార్తె అయిన వర్షిణి బస్సు ఆలస్యం కావడం వల్ల గురువారం నాటి ప్రీ-ఫైనల్ పరీక్షకు గంట ఆలస్యంగా హాజరైంది.

ఆలస్యంగా వచ్చిన వర్షిణిపై ఫిజిక్స్, ఇంగ్లిష్ లెక్చరర్లు లక్ష్మి, మధుర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ముందు ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు. పరీక్ష ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లిన వర్షిణి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పి కన్నీరు పెట్టుకుంది. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ కొద్దిసేపటికే స్పృహ తప్పి పడిపోయింది. తల్లిదండ్రులు ఆమెను వెంటనే మల్కాజిగిరిలోని ప్రైవేటు ఆసుపత్రికి, ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. సీటీ స్కాన్ రిపోర్టుల ఆధారంగా మెదడులో రక్తం గడ్డకట్టడం (బ్రెయిన్ స్ట్రోక్) వల్ల ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

వర్షిణి మరణానికి కారణమైన లెక్చరర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. అంబులెన్స్‌లో మృతదేహాన్ని కళాశాల ప్రాంగణానికి తీసుకొచ్చి నిరసన తెలిపారు. సదరు లెక్చరర్లు నిరంతరం విద్యార్థులను దుర్భాషలాడుతుంటారని తోటి విద్యార్థులు మండిపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ప్రిన్సిపాల్ నాగలక్ష్మి, విద్యార్థిని పట్ల లెక్చరర్ల ప్రవర్తన తన దృష్టికి రాలేదని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Varshini
Student death
Brain stroke
Hyderabad
MRMR College
Lecturer harassment
Malkajgiri
Pre final exam
Student protest

More Telugu News