Republic Day: రిపబ్లిక్ డే ఏర్పాట్లలో ఆసక్తికర అంశం

Republic Day Delhi Uses Chicken to Prevent Bird Strikes
  • ఢిల్లీలో యుద్ధ విమానాల విన్యాసాల కోసం సన్నాహాలు చేస్తున్న భారత వైమానిక దళం 
  • విమానాలకు పక్షులు అడ్డు రాకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన ఢిల్లీ ప్రభుత్వం
  • ఈసారి దాదాపు 1275 కిలోల బోన్‌లెస్‌ చికెన్‌ను వినియోగించనున్నట్లు వెల్లడి
గణతంత్ర వేడుకల ఏర్పాట్లలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీ సర్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా యుద్ధ విమానాల విన్యాసాల కోసం భారత వైమానిక దళం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో విమానాలకు పక్షులు అడ్డు రాకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

విమానాలకు పక్షులు ఢీకొనే ప్రమాదాన్ని నివారించేందుకు ఈసారి దాదాపు 1275 కిలోల బోన్‌లెస్‌ చికెన్‌ను వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమంగా ఈ చర్యలు అమలు చేయనున్నారు.

రిపబ్లిక్‌ డే పరేడ్‌లో పాల్గొనే విమానాల భద్రత కోసం గద్దలు తదితర పెద్ద పక్షులను దూరంగా ఉంచేందుకు ఏటా మాంసాన్ని వినియోగిస్తుంటారు. అయితే ఈసారి వన్యప్రాణి సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బోన్‌లెస్‌ చికెన్‌ ఉపయోగించాలని నిర్ణయించినట్లు ఢిల్లీ అటవీ శాఖ తెలిపింది. గణతంత్ర వేడుకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు ఈ చర్యలు అవసరమని అధికారులు పేర్కొన్నారు.

నగరంలో పక్షులు ఎక్కువగా సంచరించే ఎర్రకోట, జామా మసీద్, మండీ హౌస్‌, ఢిల్లీ గేట్‌ సహా మొత్తం 20 కీలక ప్రాంతాల్లో జనవరి 15 నుంచి 26 వరకు ఈ కార్యక్రమం చేపడతారు. వైమానిక దళం సహకారంతో రెండు రోజులకు ఒకసారి కొంత ఎత్తు నుంచి మాంసం ముక్కలను జారవిడుస్తారు. దీని వల్ల పక్షులు ఎక్కువ ఎత్తుకు వెళ్లకుండా ఆ స్థాయిలోనే సంచరిస్తాయని అధికారులు వివరించారు.

రిపబ్లిక్‌ డేకు ముందు 10 - 15 రోజుల పాటు ఇలా చేయడం ద్వారా పక్షులు ఈ ఆహార విధానానికి అలవాటు పడతాయని, తద్వారా వైమానిక ప్రదర్శన సమయంలో విమాన మార్గాల్లోకి అవి రాకుండా నియంత్రించవచ్చని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం కోసం మొత్తం 1275 కిలోల చికెన్‌ అవసరమని అంచనా వేసిన ఢిల్లీ అటవీ శాఖ, ఒక్కో ప్రదేశంలో సగటున 20 కిలోల మాంసాన్ని వినియోగించనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి తాజాగా టెండర్‌ నోటీస్‌ను కూడా జారీ చేసింది. 
Republic Day
Delhi
Indian Air Force
boneless chicken
bird strike
wildlife conservation
Republic Day parade
Red Fort
Jama Masjid
Delhi Forest Department

More Telugu News