Sankranti: ఏపీలో సంక్రాంతి హడావిడి... అత్యంత రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

Sankranti rush at bus and railway stations in AP
  • పట్టణాల నుంచి స్వగ్రామాలకు బయలుదేరుతున్న పెద్ద సంఖ్యలో పల్లె ప్రజలు
  • ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
  • వృద్దులు, పిల్లలతో ప్రయాణిస్తున్న వారు బస్టాండ్లలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనం
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో పండుగకు నాలుగైదు రోజుల ముందే ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం పట్టణాల్లో నివసిస్తున్న వారు కుటుంబ సమేతంగా ఊర్లకు బయలుదేరడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది.

ముఖ్యంగా హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లోని బస్ స్టాండ్ల వద్ద ఎప్పుడూ లేనంత రద్దీ నెలకొంది. బస్సుల సంఖ్యతో పోల్చితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అనేక మంది గంటల తరబడి బస్ స్టేషన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లగేజీతో పాటు పిల్లలు, వృద్ధులతో ప్రయాణించే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో తోపులాటలు, గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నప్పటికీ రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పండుగ రద్దీ దృష్ట్యా రోజు నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

బస్ స్టేషన్లలో ప్రయాణికులకు మార్గనిర్దేశం చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు. రవాణా శాఖ అధికారులు, పోలీసులు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. బస్ స్టేషన్ల పరిసరాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించి, భద్రతా ఏర్పాట్లు పెంచారు. ఈ నెల 18 వరకు పండుగ రద్దీ కొనసాగనున్న నేపథ్యంలో ప్రయాణికులు సహనం పాటిస్తూ అధికారుల సూచనలను పాటించాలని రవాణా శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 
Sankranti
APSRTC
Andhra Pradesh
Telugu states
bus stations
railway stations
special buses
festival rush
Hyderabad
Vijayawada

More Telugu News