డబ్ల్యూపీఎల్ 2026 షురూ.. సజన, కేరీ మెరుపులు.. ఆర్సీబీ టార్గెట్ 155

  • మహిళల ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభం 
  • తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్లకు 154 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్
  • సజీవన్ సజన (45), నికోలా కేరీ (40) కీలక ఇన్నింగ్స్‌లు
  • 4 వికెట్లతో సత్తా చాటిన ఆర్సీబీ బౌలర్ నడిన్ డి క్లర్క్
  • 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి దూకుడుగా ఆడుతున్న బెంగళూరు
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బౌలింగ్ ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే ముంబైకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అమెలియా కెర్ (4), నాట్ సివర్-బ్రంట్ (4) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. దీంతో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో సజీవన్ సజన (25 బంతుల్లో 45), నికోలా కేరీ (29 బంతుల్లో 40) అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 82 పరుగులు జోడించి జట్టుకు పోరాడే స్కోరు అందించారు.

బెంగళూరు బౌలర్లలో నడిన్ డి క్లర్క్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 4 వికెట్లతో ముంబై పతనాన్ని శాసించింది. లారెన్ బెల్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూకుడుగా ఛేదనను ఆరంభించింది. ఓపెనర్లు స్మృతి మంధాన, గ్రేస్ హారిస్ ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. తాజా సమాచారం అందేసరికి ఆర్సీబీ 2.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. మంధాన (9), హారిస్ (16) క్రీజులో ఉన్నారు.


More Telugu News