సంక్రాంతి ముంగిట శుభవార్త... ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానుల సమ్మె విరమణ

  • సంక్రాంతి వేళ ప్రయాణికులకు భారీ ఊరట
  • సమ్మె విరమణ ప్రకటన చేసిన ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు
  • యాజమాన్యంతో సఫలమైన సంఘాల చర్చలు
  • ఈ నెల 20లోపు సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ
  • పండుగకు యథావిధిగా తిరగనున్న 2,500 అద్దె బస్సులు
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం భారీ ఊరట కల్పించింది. ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు జనవరి 12 నుంచి చేపట్ట తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం నేతలు ప్రకటించారు.

తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అద్దె బస్సుల యజమానులు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో పండుగ రద్దీ సమయంలో సుమారు 2,500 బస్సులు నిలిచిపోతాయని ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, అద్దె బస్సుల సంఘాల నేతలతో చర్చలు జరిపారు.

బస్సుల్లో ఓవర్‌లోడ్, ప్రమాదాల సమయంలో బీమా, కేఎంపీఎల్‌ను 5.77 నుంచి 5.27కి తగ్గించడం, నిర్వహణ ఖర్చుల కోసం ఇచ్చే మొత్తాన్ని పెంచడం, కార్మికుల వేతనాలు పెంచడం వంటి ఐదు ప్రధాన డిమాండ్లను యజమానులు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలపై ఎండీ వెంటనే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో చర్చించారు. ఈ నెల 20వ తేదీలోగా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

మంత్రి హామీతో సంతృప్తి చెందిన యజమానులు సమ్మెను విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో, సంక్రాంతి కోసం ఆర్టీసీ ఇప్పటికే ప్రకటించిన 8,432 ప్రత్యేక బస్సులతో పాటు 2,500 అద్దె బస్సులు కూడా యథావిధిగా నడవనున్నాయి. ఫలితంగా పండుగ వేళ ప్రయాణికుల ప్రయాణం సులభతరం కానుంది.


More Telugu News