డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కోటి ఆర్థిక సాయం, కుమారుడికి పదోన్నతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • వైసీపీ హయాంలో వేధింపులకు గురైన డాక్టర్ సుధాకర్
  • వేధింపులకు తట్టుకోలేక మరణించిన సుధాకర్
  • కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ పోస్టును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే దిశగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయం అందించడమే కాకుండా... ప్రస్తుతం సహకార శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్ కు పదోన్నతి కల్పించి, గ్రూప్2 స్థాయి డిప్యూటీ తహసీల్దార్ పోస్టును ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. 


ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ... ఇది డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కేవలం డబ్బు సహాయం మాత్రమే కాదని, ఆయన కుటుంబానికి ఆర్థిక భద్రత, ఉద్యోగ స్థిరత్వం కల్పించే నిర్ణయమని అన్నారు. దీంతో పాటు ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఎల్‌ఐఎన్‌సీ) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విద్యార్థుల సంక్షేమం విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో 39.52 లక్షల మంది విద్యార్థులకు పాఠశాల కిట్‌లు సరఫరా చేసిన సంస్థలకు చెల్లించాల్సిన రూ.944.53 కోట్ల బకాయిలను క్లియర్ చేయడానికి ఆమోదం తెలిపారు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, వివిధ పరిశ్రమలకు భూమి కేటాయింపులు చేశారు.


More Telugu News