టీటీడీలో కొలువులు, పదోన్నతులు.. ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్

  • ఎస్వీ గోశాలలో 12 కొత్త పోస్టులకు ఆమోదం
  • 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వైద్య సిబ్బందికి పదోన్నతులు
  • తాళ్లపాక, మణ్యం కైంకర్యాల పోస్టులకు వారసత్వ హక్కుల నిరాకరణ
  • ప్రభుత్వ ఆమోదం తర్వాత అమలులోకి రానున్న నిర్ణయాలు
టీటీడీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఉద్యోగ నియామకాలు, సర్వీసు నిబంధనల సవరణలు, పదోన్నతులపై పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 16న జరిగిన సమావేశంలో ఆమోదించిన ఈ ప్రతిపాదనలను తుది అనుమతి కోసం ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.

ముఖ్యంగా టీటీడీ ఎస్వీ గోసంరక్షణ శాలలో 12 కొత్త ఉద్యోగాలను మంజూరు చేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వీటిలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (2), గోశాల మేనేజర్‌ (2), డైరీ సూపర్‌వైజర్‌ (6), డైరీ అసిస్టెంట్‌ (2) పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాల వల్ల ఏటా రూ.1.05 కోట్ల అదనపు భారం పడుతుందని, దీనిని టీటీడీనే భరిస్తుందని స్పష్టం చేశారు. పశుపోషణలో డిప్లొమాతో పాటు ఐదేళ్ల అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు.

అలాగే టీటీడీ వైద్య విభాగంలో దాదాపు 30 ఏళ్లుగా ఒకే హోదాలో పనిచేస్తున్న సిబ్బందికి పదోన్నతులు కల్పించేందుకు నిర్ణయించారు. రేడియోగ్రాఫర్‌ పోస్టును ‘చీఫ్‌ రేడియోగ్రాఫర్‌’గా, ఫిజియోథెరపిస్ట్‌ పోస్టును ఉన్నత స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు. దీంతో ఆయా విభాగాల్లోని సిబ్బందికి ప్రమోషన్లు లభించనున్నాయి.

ఆలయ కైంకర్యాలకు సంబంధించిన పోస్టుల నియామకాల్లోనూ టీటీడీ కీలక మార్పులు చేసింది. తాళ్లపాక కైంకర్యపరుడు, మణ్యం దార్ పోస్టులకు వంశపారంపర్య హక్కులు కల్పించాలన్న విజ్ఞప్తులను బోర్డు తోసిపుచ్చింది. 1987 చట్టం ప్రకారమే నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. తాళ్లపాక కైంకర్యపరుడు పోస్టుకు సంకీర్తనల్లో ప్రావీణ్యం, 40 ఏళ్ల లోపు వయసు ఉండాలని నిబంధన విధించారు. మణ్యం దార్ పోస్టుకు 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెంది ఉండాలని పేర్కొన్నారు. వీటితో పాటు బర్డ్ ఆసుపత్రి, శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలోని కొన్ని పోస్టులకు కూడా అర్హతలను సవరించారు.


More Telugu News