Pakistan Super League: పీఎస్‌ఎల్‌లోకి కొత్తగా రెండు జట్లు.. ఐపీఎల్ ఆటగాళ్ల జీతాలతో పోలిస్తే చాలా తక్కువ!

Pakistan Super League Two New Teams Added
  • రూ. 114 కోట్లకు సియాల్‌కోట్, హైదరాబాద్ ఫ్రాంచైజీల విక్రయం
  • హైదరాబాద్ జట్టు ధర పంత్, శ్రేయస్ జీతంతో దాదాపు సమానం
  • రెండు జట్ల ఖరీదు ఐపీఎల్ టాప్-9 ఆటగాళ్ల జీతం కంటే తక్కువ
  • మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న కొత్త సీజన్
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) టీ20 టోర్నమెంట్‌లో కొత్తగా మరో రెండు జట్లు చేరాయి. నిన్న‌ జరిగిన వేలంలో సియాల్‌కోట్, హైదరాబాద్ ఫ్రాంచైజీలను రెండు సంస్థలు దక్కించుకున్నాయి. దీంతో ఇప్పటివరకు ఆరు జట్లతో జరిగిన ఈ లీగ్, ఇకపై ఎనిమిది జట్లతో కొనసాగనుంది.

రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ఓజడ్ డెవలపర్స్, సియాల్‌కోట్ ఫ్రాంచైజీని రూ. 58.38 కోట్లకు కొనుగోలు చేసింది. అమెరికాకు చెందిన ఏవియేషన్, హెల్త్‌కేర్ సంస్థ ఎఫ్‌కేఎస్ గ్రూప్.. హైదరాబాద్ ఫ్రాంచైజీని రూ. 55.57 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ రెండు జట్ల అమ్మకం ద్వారా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు సుమారు రూ. 114 కోట్ల ఆదాయం వచ్చింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పీఎస్ఎల్ హైదరాబాద్ జట్టు ధర, మన ఐపీఎల్‌లోని ఇద్దరు స్టార్ ఆటగాళ్ల జీతాలతో దాదాపు సమానంగా ఉంది. శ్రేయస్ అయ్యర్ (రూ. 26.75 కోట్లు), రిషభ్ పంత్ (రూ. 27 కోట్లు) ఇద్దరి జీతాలు కలిపితే రూ. 53.75 కోట్లు అవుతుంది. పీఎస్ఎల్ హైదరాబాద్ జట్టు ధర రూ. 55.57 కోట్లు మాత్రమే. అంతేగాక‌ ఈ రెండు కొత్త పీఎస్ఎల్ జట్ల మొత్తం ఖరీదు (రూ. 114 కోట్లు), ఐపీఎల్ 2026 వేలంలో అమ్ముడైన టాప్ 9 ఆటగాళ్ల ఉమ్మడి జీతం (రూ. 118 కోట్లు) కంటే తక్కువ కావడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ముల్తాన్ సుల్తాన్స్ జట్టును ఈ ఏడాది పాకిస్థాన్ క్రికెట్ బోర్డే నడపనుంది. ఏప్రిల్‌లో పీఎస్ఎల్ ముగిశాక ఆ జట్టును అమ్మకానికి పెట్టనున్నారు. పీఎస్ఎల్ మేనేజ్‌మెంట్‌తో విభేదాల కారణంగా ముల్తాన్ జట్టును వదులుకున్న మాజీ యజమాని అలీ తరీన్, కొత్త జట్ల వేలంలో చివరి నిమిషంలో తప్పుకున్నారు. కాగా, మార్చి 26 నుంచి ఎనిమిది జట్లతో పీఎస్ఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది.
Pakistan Super League
PSL
Sialkot
Hyderabad
Shreyas Iyer
Rishabh Pant
Pakistan Cricket Board
T20 Tournament
IPL
Franchise

More Telugu News