Muniraj: అన్న ఇంటికి నిప్పు పెట్టబోయి.. తానే కాలిపోయిన తమ్ముడు.. వీడియో ఇదిగో!

Muniraj Burns Himself Trying to Set Brothers House on Fire
  • బెంగళూరు రూరల్ జిల్లాలో ఆస్తి వివాదం నేపథ్యంలో దారుణం
  • అప్పుల బాధతో పూర్వీకుల భూమి అమ్మాలని అన్నపై ఒత్తిడి తెచ్చిన మునిరాజ్
  • అన్న నిరాకరించడంతో ఇంటికి నిప్పు పెట్టిన తమ్ముడు
  • ఆ మంటల్లో తానే చిక్కుకొని తీవ్ర గాయాలు
  • ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డ్
బెంగళూరు రూరల్ జిల్లా హోసకోట తాలూకా గోవిందపూర్ గ్రామంలో ఒక వ్యక్తి తన అన్న ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తు తనే ఆ మంటల్లో చిక్కుకున్నాడు. ఈ నాటకీయ పరిణామంలో నిందితుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. మునిరాజ్ అనే వ్యక్తి గత ఎనిమిదేళ్లుగా స్థానికంగా చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆ వ్యాపారంలో భారీగా నష్టాలు రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో, తమకున్న పూర్వీకుల భూమిని అమ్మి అప్పులు తీర్చుకుందామని తన అన్న రామకృష్ణను కోరాడు. అయితే రామకృష్ణ అందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.

అన్న కుటుంబాన్ని చంపాలని ప్లాన్
ఈ కోపంతో రామకృష్ణ కుటుంబంపై పగ పెంచుకున్న మునిరాజ్ మంగళవారం అర్ధరాత్రి తన అన్న ఇంటికి చేరుకున్నాడు. ఎవరూ బయటకు రాకుండా ఇంటికి బయట నుంచి గడియ పెట్టి, లోపలికి పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఆ సమయంలో పెట్రోల్ అతని చేతులు, దుస్తులపై పడటంతో క్షణాల్లో మునిరాజ్‌కు కూడా మంటలు అంటుకున్నాయి.

మునిరాజ్ ఆర్తనాదాలు విన్న పొరుగువారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని హోసకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఇంట్లో ఉన్న రామకృష్ణ కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. రామకృష్ణ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ ఫుటేజీని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Muniraj
Bengaluru
Hosakote
brother sets fire
family feud
crime news
property dispute
attempted murder
Govindapur
Chit fund business

More Telugu News