Tilak Varma: తిలక్ వర్మ విషయంలో బీసీసీఐ కీల‌క అప్‌డేట్.. కివీస్‌ సిరీస్ నుంచి ఔట్!

Tilak Varma Out of New Zealand T20 Series Due to Injury
  • కివీస్‌తో తొలి మూడు టీ20లకు దూరమైన తిలక్ వర్మ
  • టెస్టిక్యులర్ టార్షన్ సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్న యువ బ్యాటర్
  • ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటించిన బీసీసీఐ
  • విశాఖలో జరిగే నాలుగో టీ20కి అందుబాటుపై సందిగ్ధత
  • తిలక్ స్థానంలో మిడిలార్డర్‌లో ఇషాన్ కిషన్‌ను పరిశీలించే అవకాశం
న్యూజిలాండ్‌తో ఈ నెలలో జరగనున్న టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. యువ బ్యాటర్, హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ సిరీస్‌లోని తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. టెస్టిక్యులర్ టార్షన్ అనే వైద్యపరమైన సమస్య కారణంగా అతనికి శస్త్రచికిత్స జరిగిందని, అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నాడని బీసీసీఐ ప్రకటించింది.

రాజ్‌కోట్‌లోని ఒక ఆసుపత్రిలో ఈ నెల‌ 7న తిలక్ వర్మకు ఈ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. నిన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అతను, ఈరోజు హైదరాబాద్‌కు తిరిగి రానున్నాడు. ప్రస్తుతం తిలక్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. గాయం పూర్తిగా నయమై, శస్త్రచికిత్స గాట్లు పూర్తిగా మానిన తర్వాతే అతను తిరిగి శిక్షణ ప్రారంభిస్తాడని బోర్డు స్పష్టం చేసింది.

ఈ సిరీస్‌లో భాగంగా ఈ నెల‌ 21, 23, 25 తేదీల్లో జరగనున్న తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్ అందుబాటులో ఉండడు. అనంతరం 28న విశాఖపట్నం, 31న తిరువనంతపురంలో జరిగే చివరి రెండు మ్యాచ్‌లకు అతను ఆడ‌టంపై, కోలుకుంటున్న తీరును బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతానికి తొలి మూడు మ్యాచ్‌ల కోసం తిలక్ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేయలేదు.

గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్‌లో భారత జట్టులో తిలక్ వర్మ కీలక మిడిలార్డర్ బ్యాటర్‌గా మారాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కావడం, స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలగడం అతనికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. అతని గైర్హాజరీతో జట్టు యాజమాన్యం బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌లో లేదా 3వ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఇషాన్ ఈ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు.

2026లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌నకు సన్నాహాల్లో భాగంగా ఈ సిరీస్ భారత్‌కు చాలా కీలకం. అందువల్ల తిలక్ ఫిట్‌నెస్‌ను సెలక్టర్లు, జట్టు యాజమాన్యం నిశితంగా పరిశీలించిన తర్వాతే అతని పునరాగమనంపై తుది నిర్ణయం తీసుకుంటారు. అతని ఫిట్‌నెస్‌పై తదుపరి అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు అందిస్తామని బీసీసీఐ పేర్కొంది.
Tilak Varma
Tilak Varma injury
India vs New Zealand T20
Testicular torsion
BCCI update
Ishan Kishan
T20 World Cup 2026
Indian cricket team
Rajkot Hospital
Sunrisers Hyderabad

More Telugu News