YS Jagan Mohan Reddy: జగన్ ఫ్లెక్సీకి కోడి రక్తంతో అభిషేకం.. తిరుపతిలో ఇద్దరు వైసీపీ కార్యకర్తల అరెస్ట్

YS Jagan Mohan Reddy Flexi Doused in Chicken Blood Two Arrested in Tirupati
  • పుట్టినరోజున కోడిని కోసి, ఆ రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం 
  • భయానక వీడియోకు సినిమా పాటను జోడించి సోషల్ మీడియాలో పోస్ట్
  • కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు
  • నిందితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి
తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు చేసిన ఒక వికృత చర్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి కోడి రక్తంతో అభిషేకం చేసి, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతి కట్టకిందపల్లెకు చెందిన నల్లందుల బాలసుబ్రహ్మణ్యం, ప్రైవేట్ ఉద్యోగి భువనకుమార్ రెడ్డి (29) గత డిసెంబర్ 21న కొత్తపల్లి కూడలి వద్ద జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే రాత్రి ఒక కోడిని తెచ్చి, దాన్ని గొంతు కోసి ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీపై చల్లారు. ఈ భయానక దృశ్యాలను వీడియో తీసి, దానికి 'రక్తచరిత్ర' సినిమాలోని హింసాత్మక పాటను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 15 రోజుల తర్వాత ఈ విషయంపై రవి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ రామస్వామి కేసు నమోదు చేశారు. గురువారం నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు.

నిందితుల్లో ఒకరైన బాలసుబ్రహ్మణ్యం చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సమీప బంధువు అని పోలీసులు తెలిపారు. నిందితులు కోర్టుకు వచ్చిన సమయంలో వారిని పరామర్శించేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
YS Jagan Mohan Reddy
Jagan birthday
Tirupati
YSRCP activists arrested
Chevi Reddy Bhaskar Reddy
Flexi Abhishekam
Kodi Raktham
Political controversy Andhra Pradesh
Andhra Pradesh politics
Social media video

More Telugu News