Nara Lokesh: చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు: నారా లోకేశ్

Nara Lokesh Says Chandrababu is Our Only Leader
  • తాను కూడా పార్టీకి ఒక సైనికుడినేనని లోకేశ్ ఉద్ఘాటన 
  • వచ్చే ఎన్నికల్లో గెలిచి చరిత్రను తిరగరాయాలని పిలుపు
  • ప్రతి మూడు నెలలకు నేతల పనితీరుపై సమీక్ష ఉంటుందని హెచ్చరిక
  • కూటమి పార్టీలతో కలిసి 15 ఏళ్ల పాటు ముందుకు సాగాలని సూచన
"తెలుగుదేశం పార్టీలో మనందరిదీ ఒకటే లైన్, ఒకటే అజెండా ఉండాలి. మన నాయకుడు, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఒక్కరే. నాతో సహా మిగతావారంతా సైనికులం మాత్రమే. నేను కూడా తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడినే" అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీలో నాయకత్వంపై ఎలాంటి సందిగ్ధతకు తావులేదని, చంద్రబాబు నాయకత్వంలోనే అందరూ పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 

ఉండవల్లిలోని తన నివాసంలో నూతనంగా నియమితులైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జోనల్ కోఆర్డినేటర్లతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ, క్రమశిక్షణ, నాయకుల బాధ్యతలపై ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.
వచ్చే ఎన్నికల్లో గెలిచి చరిత్రను తిరగరాయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని లోకేశ్ అన్నారు. 

"1999లో మాత్రమే మనం వరుసగా రెండోసారి గెలిచాం. ఆ చరిత్రను పునరావృతం చేయాలి. సొంతిల్లు కంటే కిరాయి ఇల్లుపై దృష్టి పెట్టే ధోరణికి ఫుల్ స్టాప్ పడాలి. పార్టీ ప్రయోజనాలే అందరికీ శిరోధార్యం కావాలి" అని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పనితీరును ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తామని, ఈ నిబంధన రాష్ట్ర కమిటీకి కూడా వర్తిస్తుందని తేల్చిచెప్పారు. తీసుకునే పది నిర్ణయాల్లో మూడు తప్పులు జరిగినా, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలని సూచించారు.

పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ప్రతిఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని లోకేశ్ ఆదేశించారు. "పార్టీ అనేది ఒక వ్యవస్థ, వ్యక్తులపై ఆధారపడకూడదు. అందరూ సాంకేతికతపై అవగాహన పెంచుకోవాలి. ‘మై టీడీపీ’ యాప్ ద్వారా వచ్చే ఆదేశాలను కచ్చితంగా అమలుచేయాలి. మంగళగిరి విజయమే ఇందుకు నిదర్శనం" అని వివరించారు. 

కష్టపడి పనిచేసే ఉత్తమ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చామని, పనిచేసే వారిని పార్టీ గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్, కార్యకర్తల సమావేశాలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత కొత్త కమిటీలపై ఉందని గుర్తుచేశారు.

మున్ముందు పార్టీ కార్యక్రమాల వేగం మరింత పెంచుతానని, పార్టీ కోసం పూర్తి సమయం కేటాయిస్తానని లోకేశ్ తెలిపారు. కూటమి పార్టీలతోనూ సమన్వయం చేసుకోవాలని, నెలకోసారి వారితో సమావేశం కావాలని సూచించారు. "మనం 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాపైనా దృష్టిసారించాలి" అన్నారు. వచ్చే ఏడాది చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని కోరారు. 

75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు కార్యకర్తలను స్వయంగా కలుస్తున్నారని, కానీ జగన్ రెడ్డి మాత్రం పరదాలు కట్టుకుని తిరిగారని విమర్శించారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ దాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు జోనల్ కోఆర్డినేటర్లు మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవి రావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Nara Lokesh
Chandrababu Naidu
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Party Cadre
Political Strategy
Palla Srinivasa Rao
2024 Elections
My TDP App

More Telugu News