Sarfaraz Khan: విజయ్ హజారే ట్రోఫీ: సర్ఫరాజ్ ఖాన్ మరో అద్భుత రికార్డు

Sarfaraz Khan Breaks Record With Fastest Fifty in Vijay Hazare Trophy
  • సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్
  • 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో కొత్త రికార్డు
  • లిస్ట్ ఏ క్రికెట్‌లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్
  • సర్ఫరాజ్ పోరాడినా ఒక్క పరుగుతో ముంబై ఓటమి
  • పంజాబ్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు 4 వికెట్లు
భారత బ్యాటర్, ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. జైపూర్‌లోని జైపురియా విద్యాలయ గ్రౌండ్‌లో గురువారం ఈ మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో తన సోదరుడు ముషీర్ ఖాన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్, ఆరంభం నుంచే విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ బౌలర్ అభిషేక్ శర్మ వేసిన ఒకే ఓవర్లో ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత హర్‌ప్రీత్ బ్రార్ ఓవర్లోనూ 19 పరుగులతో విరుచుకుపడి, కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో బరోడా ఆటగాడు అజిత్ సేథ్ (16 బంతులు) పేరిట ఉన్న ఐదేళ్ల రికార్డు బద్దలైంది.

మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 34 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అయినప్పటికీ, ఈ మ్యాచ్ లో ముంబై కేవలం ఒక్క పరుగు తేడా ఓటమిపాలైంది. పంజాబ్ 216 పరుగులు చేయగా... ముంబై 26.2 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. పంజాబ్ బౌలర్ గుర్నూర్ బ్రార్ 4 వికెట్లతో ముంబైని దెబ్బతీశాడు.

ఈ సీజన్‌లో సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లలో 303 పరుగులు చేశాడు. అంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ 7 మ్యాచ్ ల్లో 329 పరుగులు సాధించాడు.
Sarfaraz Khan
Vijay Hazare Trophy
Mumbai
Punjab
Fastest Fifty
List A Cricket
Shreyas Iyer
Cricket Record
Ajit Seth
Musheer Khan

More Telugu News