YS Jagan Mohan Reddy: అది పిచ్చి పని... అమరావతి రెండో దశ భూసేకరణపై జగన్ విమర్శలు

YS Jagan Criticizes Amaravati Phase 2 Land Acquisition
  • అమరావతి రెండో దశ భూసేకరణపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం
  • తొలిదశ భూములనే అభివృద్ధి చేయలేదని విమర్శ
  • 50 వేల ఎకరాలకే లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్న
  • చంద్రబాబు, ఆయన బినామీల కోసమే ఈ ప్లాన్ అని ఆరోపణ
  • రాజధాని పేరుతో రైతులను వంచిస్తున్నారని వ్యాఖ్య
అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణ చేపట్టాలన్న ప్రభుత్వ ఆలోచనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మొదటి విడతలో సేకరించిన భూములనే అభివృద్ధి చేయకుండా మరోసారి భూములు తీసుకోవడం పిచ్చి పని అని అభివర్ణించారు. గురువారం తాడేపల్లిలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. "రాజధాని కోసం మొదటి దశలో 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ భూమిలో రోడ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికే లక్ష కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా చంద్రబాబే చెప్పారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి, ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు" అని జగన్ ప్రశ్నించారు.

తొలిదశలో భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. "ఇలాంటి పరిస్థితుల్లో రెండో దశ పేరుతో మరో 50 వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారు? మొత్తం లక్ష ఎకరాల అభివృద్ధికి రెండు లక్షల కోట్లు అవసరమవుతాయి. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారు? కేవలం చంద్రబాబు, ఆయన బినామీలు దోచుకోవడానికే ఈ భూసేకరణ జరుగుతోంది" అని జగన్ ఘాటుగా ఆరోపించారు. రాజధాని అభివృద్ధి పేరుతో రైతులను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం వారికి వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
YS Jagan Mohan Reddy
Jagan
Amaravati
Andhra Pradesh
Land Acquisition
Chandrababu Naidu
YSRCP
Farmers
Capital City
Land Pooling

More Telugu News