Vijay: బుక్ మై షోకు భారీ దెబ్బ... నాలుగున్నర లక్షల టికెట్ల డబ్బులు రిఫండ్ చేయాల్సిన పరిస్థితి
- విజయ్ 'జన నాయగన్'కు భారీ బుకింగులు
- సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో విడుదల వాయిదా
- 5 నుంచి 7 రోజుల్లో క్రెడిట్ కానున్న డబ్బులు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' రేపు జనవరి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సర్టిఫికేట్ ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడింది. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మీద విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన క్షణంలోనే లక్షలాది టికెట్లు సేల్ అయ్యాయి.
కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడటం... భారతీయ సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డుకు కారణమైంది. సాధారణంగా సినిమా పోస్ట్‌పోన్ అయితే కొన్ని వందలు లేదా వేల టికెట్లు రిఫండ్ అవుతుంటాయి. ఇక్కడ మాత్రం ఏకంగా 4.5 లక్షల టికెట్లను బుక్‌మైషో ప్లాట్‌ఫాం రిఫండ్ చేయాల్సి వచ్చింది. ఇంత భారీ సంఖ్యలో ఒకేసారి టికెట్లు క్యాన్సిల్ చేసి, ప్రేక్షకుల ఖాతాల్లోకి డబ్బులు తిరిగి జమ చేయడం భారతీయ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి. లక్షలాది మంది ఫ్యాన్స్ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో బుక్‌మైషో, డిస్ట్రిబ్యూటర్లు ఈ గట్టి నిర్ణయం తీసుకున్నారు.
ఈ రిఫండ్ ప్రక్రియ కూడా సులువైన పని కాదు. లక్షల మందికి ఒకేసారి డబ్బులు తిరిగి పంపడం బుక్‌మైషో వంటి సంస్థలకు ఒక భారీ సవాలే. అయినా వాళ్లు చెప్పిన మాట ప్రకారం, టికెట్ బుక్ చేసుకున్నవాళ్లు ఏ పేమెంట్ మోడ్ ఉపయోగించారో (యూపీఐ అయినా, కార్డు అయినా, వాలెట్ అయినా) అదే దారిలో 5 నుంచి 7 పని రోజుల్లో డబ్బులు నేరుగా ఖాతాల్లో పడతాయి.