Ramya: వీధి కుక్కల సమస్యను మగవారితో పోల్చిన సినీ నటి రమ్య
- వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలన్న సుప్రీంకోర్టు
- కుక్కల్లో ఏది కాటేస్తుందో, ఏది కాటేయదో ముందుగా తెలుసుకోవడం కష్టమని వ్యాఖ్య
- మగాళ్లు కూడా ఎవరు అత్యాచారం చేస్తారో, ఎవరు హత్య చేస్తారో తెలియదన్న రమ్య
కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రమ్య... ఆ తర్వాత రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆమె యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. చిత్రరంగంలోకి తిరిగి వచ్చిన ఆమె ఒక సినిమా నిర్మాణ సంస్థను కూడా స్టార్ట్ చేశారు. రాజకీయాల నుంచి దూరమైనా సామాజిక అంశాలపై స్పందిస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా జంతు ప్రేమికురాలైన రమ్య... మూగ జీవుల హక్కులు, వీధి కుక్కల సమస్యలపై తరచూ తన అభిప్రాయాలు చెబుతుంటారు.
గత ఏడాది వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచాలని సుప్రీం సూచించింది. ఈ సూచనపై రమ్యతో పాటు దేశవ్యాప్తంగా కుక్కల ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు చోట్ల నిరసనలు కూడా జరిగాయి. తాజాగా ఇదే అంశంపై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, వీధి కుక్కలను వాటి ప్రవర్తన ఆధారంగా వర్గీకరించడం సాధ్యం కాదని చెప్పింది. ఈ కుక్క కాటేస్తుంది, ఈ కుక్క కాటేయదు అని ముందుగా తెలుసుకోవడం అసాధ్యమని... అందుకే అన్ని వీధి కుక్కలను ఆశ్రయ కేంద్రాల్లో ఉంచడమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ వ్యాఖ్యలపై రమ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ... మగాళ్లను కూడా అర్థం చేసుకోవడం చాలా కష్టమని, వారు ఎప్పుడు అత్యాచారం చేస్తారో, ఎప్పుడు హత్య చేస్తారో తెలియదని, అలాంటప్పుడు పురుషులందరినీ జైలులో పెట్టేయాలా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సమస్యను పురుషులతో పోల్చడం సరికాదని పలువురు మండిపడుతున్నారు.