Revanth Reddy: మోదీ సర్కారుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

Revanth Reddy Criticizes BJP and Narendra Modi
  • బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చేసేవారని ఆరోపణ
  • కాంగ్రెస్ అప్రమత్తం చేయడంతో బీజేపీ 240 సీట్ల వద్ద ఆగిపోయిందని వెల్లడి
  • మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తానంటే అంగీకరించేది లేదన్న ముఖ్యమంత్రి
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు గెలుచుకుని ఉంటే రాజ్యాంగాన్నే మార్చివేసేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెజారిటీ ఉందన్న కారణంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. మెజారిటీ ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన సమయం ఇదేనని ఆయన పిలుపునిచ్చారు. ఈ పథకంతో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు. అందుకే గత ఎన్నికల్లో 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రజలను అప్రమత్తం చేయడంతో బీజేపీ 240 సీట్ల వద్ద ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు. దీనితో రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన వాయిదా పడిందని ఆయన అన్నారు. ఓట్లను తొలగించేందుకు ఎస్ఐఆర్ తీసుకువచ్చారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Revanth Reddy
Telangana
BJP
Narendra Modi
MGNREGA
Congress Party
2024 Elections
Indian Constitution

More Telugu News