Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... ఈ అర్ధరాత్రి మూతపడనున్న వైకుంఠ ద్వారాలు
- రాత్రి ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వారాల మూసివేత
- రేపటి నుంచి యథావిధిగా అన్ని రకాల దర్శనాలు
- నిన్న స్వామిని దర్శించుకున్న భక్తులు 85,752 మంది
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈరోజు చివరి రోజు. ఈ రాత్రి ఏకాంత సేవ అనంతరం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి ఆలయంలో అన్ని ప్రత్యేక దర్శనాలు, సేవలు యథావిధిగా తిరిగి ప్రారంభమవుతాయి. భక్తులు ఈ మార్పును గమనించి ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
గత తొమ్మిది రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం రికార్డు స్థాయిలో జరిగింది. మొత్తం 7 లక్షల 9 వేల 831 మంది భక్తులు ఈ పవిత్ర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే 85 వేల 752 మంది దర్శనం చేసుకున్నారు. ఇకపై సాధారణ దర్శనాలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, దివ్య దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనాలు అన్నీ మళ్లీ రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం సాగుతాయి. భక్తులు ఆన్లైన్లో స్లాట్లు బుక్ చేసుకుని లేదా దర్శన టైమింగ్స్ చెక్ చేసుకుని రావాలని టీటీడీ సలహా ఇచ్చింది.