కొడాలి నానిపై కేసు పెట్టిన టీడీపీ నేత కిడ్నాప్.. కృష్ణా జిల్లాలో కలకలం

  • గుడివాడ టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్
  • నిర్మానుష్య ప్రదేశంలో ఆయనపై దాడి చేసి, వదిలేసిన దుండగులు
  • గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన ప్రభాకర్
  • కిడ్నాప్ వెనుక కొడాలి నాని ఉన్నారని కుటుంబ సభ్యుల ఆరోపణ
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

గుడివాడ టీడీపీ నేత దుగ్గిరాల ప్రభాకర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయడం కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదులు చేసినందుకే ఈ ఘటన జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే... నిన్న ఉదయం 9 గంటలకు ప్రభాకర్ తన బైక్‌పై మచిలీపట్నం వెళుతుండగా పెడన వద్ద కొందరు దుండగులు ఆయనను అడ్డగించి కిడ్నాప్ చేశారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి సాయంత్రం వరకు నిర్బంధించి బెదిరింపులకు గురి చేశారు. నిన్న రాత్రి సమయంలో ఆయనను వదిలేశారు. 


తనను వదిలేసిన తర్వాత... ప్రభాకర్ నేరుగా గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... దుండగులు తనను కొట్టారని తెలిపారు. 


మరోవైపు, ఈ కిడ్నాప్ వెనుక మాజీ మంత్రి కొడాలి నాని, అబ్కారీ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఉన్నారని ప్రభాకర్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. లిక్కర్ గోడౌన్, లీజు వ్యవహారాల్లో జరిగిన అవినీతిపై కొడాలి నాని, వాసుదేవరెడ్డిలపై పోలీసులకు గతంలో ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం విచారణకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ పై వారే దాడి చేయించి ఉంటారని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే, ఈ కేసు విషయంపై మాట్లాడేందుకు ప్రభాకర్ నిరాకరిస్తున్నారు. 


కుటుంబ సభ్యులు ఈ కిడ్నాప్ వ్యవహారంపై గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నాప్, దాడి వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.



More Telugu News