Donald Trump: భారత్ సహా పలు దేశాలపై 500 శాతం సుంకాలు.. కొత్త బిల్లు తెస్తున్న ట్రంప్
- రష్యాపై ఒత్తిడి పెంచే దిశగా ట్రంప్ కీలక నిర్ణయం
- రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం
- భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలే లక్ష్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు రష్యాపై మరింత ఒత్తిడి పెంచే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధించే ద్వైపాక్షిక బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్యా నుంచి చమురు, యురేనియం కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి 500 శాతం వరకు సుంకాలు పెంచే అధికారాన్ని ఈ బిల్లు ఇస్తుంది.
రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన తర్వాత ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ బిల్లు చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచి, రష్యా చమురు కొనుగోళ్లు ఆపేలా చేస్తుందని, అది పుతిన్ చేస్తున్న యుద్ధానికి నిధులు లేకుండా చేస్తుందని గ్రాహం చెప్పారు. ఈ బిల్లు వచ్చే వారం సెనేట్‌లో ఓటింగ్‌కు రావచ్చని తెలిపారు.
రష్యా నుంచి చమురు కొనుగోలుదారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్న కారణంగా భారత్ పై ట్రంప్ గత ఏడాది 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త బిల్లు మరింత కఠినమైన చర్యలకు దారి తీస్తుంది. భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఒకవైపు ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి చర్చలు జరుపుతూనే... మరోవైపు ఈ ఆంక్షల బిల్లుకు మద్దతు ఇవ్వడం రష్యాపై ఒత్తిడి పెంచే వ్యూహంగా కనిపిస్తోంది. యుద్ధం ఆపుతామని చెబుతూనే అమాయకుల్ని పుతిన్ చంపుతున్నారని గ్రాహం మండిపడ్డారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రష్యా ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బ పడుతుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్, చైనా పునరాలోచన చేయాల్సిన అవసరం వస్తుంది.