Donald Trump: భారత్ నేతృత్వంలోని సౌర కూటమికి షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్

Trump orders US withdrawal from Gurugram based International Solar Alliance
  • అంతర్జాతీయ సౌర కూటమి నుంచి వైదొలగాలని ట్రంప్ ఆదేశం
  • భారత్, ఫ్రాన్స్ చొరవతో 2015లో ఈ కూటమి ఏర్పాటు
  • అమెరికా ప్రయోజనాలకు విరుద్ధమంటూ ట్రంప్ సర్కార్ ఆరోపణ
  • మొత్తం 66 అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగిన అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సౌర కూటమి (ISA) నుంచి అమెరికా వైదొలగాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంస్థ అమెరికా జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్‌హౌస్ నిన్న‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఎస్ఏతో పాటు మొత్తం 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా వైదొలగుతున్నట్లు ట్రంప్ సర్కార్ పేర్కొంది.

వాతావరణ మార్పులను ఒక బూటకంగా అభివర్ణించే ట్రంప్, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి, ఇతర సంస్థలపై కఠినంగా వ్యవహరించారు. ఈ సంస్థల 'వాతావరణ ఛాందసవాదం' అమెరికా సార్వభౌమత్వానికి, స్వేచ్ఛకు, శ్రేయస్సుకు విఘాతం కలిగిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు.

సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించి, వాతావరణ మార్పులను ఎదుర్కోవాలనే లక్ష్యంతో భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా 2015లో ఈ కూటమిని స్థాపించాయి. గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కూటమిలో 124 దేశాలు సంతకాలు చేయగా, సుమారు 100 దేశాలు పూర్తిస్థాయి సభ్యులుగా ఉన్నాయి. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమావేశమైనప్పుడు ఈ కూటమిలో చేరతామని అమెరికా హామీ ఇచ్చింది. అంతేకాకుండా 2022-25 మధ్యకాలంలో ఐఎస్ఏకు అమెరికా 2.1 మిలియన్ డాలర్ల నిధులను కూడా అందించడం గమనార్హం.

ట్రంప్ తాజా నిర్ణయంతో పారిస్ వాతావరణ ఒప్పందానికి కారణమైన యూఎన్ ఫ్రేమ్‌వర్క్ కాన్ఫరెన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) సహా పలు పర్యావరణ సంస్థల నుంచి అమెరికా వైదొలిగినట్లయింది.
Donald Trump
International Solar Alliance
ISA
India
United States
Climate Change
Paris Agreement
Narendra Modi
Barack Obama
Marco Rubio

More Telugu News