Deloitte India Report: ఆభరణాలపై మారుతున్న భారతీయుల అభిరుచి.. డెలాయిట్ నివేదికలో కీలక విషయాలు!

Indian Jewelry Market Trends Fashion Investment Deloitte Report
  • సంపద సృష్టిలో బంగారానికి భారతీయుల పెద్దపీట
  • పెట్టుబడిగా, ఫ్యాషన్‌గా ఆభరణాల వినియోగం
  • తేలికపాటి నగలు, వెండి, ప్లాటినంపై యువతరం ఆసక్తి
  • పెళ్లిళ్లకే కాకుండా రోజువారీ అవసరాలకూ పెరుగుతున్న కొనుగోళ్లు
  • డెలాయిట్ ఇండియా నివేదికలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
భారతదేశంలో బంగారం, ఆభరణాలపై వినియోగదారుల దృక్పథంలో స్పష్టమైన మార్పు వస్తోంది. కేవలం సంప్రదాయ పెట్టుబడిగా, శుభకార్యాల్లో ధరించే వస్తువుగా కాకుండా తమ వ్యక్తిత్వాన్ని, జీవనశైలిని ప్రతిబింబించే ఫ్యాషన్‌గానూ ఆభరణాలను పరిగణిస్తున్నారు. దేశంలో 86 శాతం మంది వినియోగదారులు బంగారం, నగల కొనుగోలును సంపద సృష్టికి ఉత్తమ మార్గంగా భావిస్తున్నారని డెలాయిట్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ఇది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి మార్కెట్ ఆధారిత పెట్టుబడులతో (87శాతం) దాదాపు సమానంగా ఉండటం గమనార్హం.

ఈ నివేదిక ప్రకారం 56 శాతం మంది ఆభరణాలను పెట్టుబడిగా, ఫ్యాషన్ వస్తువుగా చూస్తుండగా, 28 శాతం మంది కేవలం పెట్టుబడి కోసమే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా 45 ఏళ్లు పైబడిన వారు, పురుషులు పెట్టుబడి కోణంలో ఆలోచిస్తుంటే, యువతరం మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. జెన్-జెడ్, మిలీనియల్స్ స్టైల్, వ్యక్తిగత అభిరుచి, రోజూ ధరించేందుకు వీలుగా ఉండే తేలికపాటి ఆభరణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

యువతరం చూపు వెండి, ప్లాటినం వైపు
యువతలో మారుతున్న అభిరుచులకు అనుగుణంగా నగల మార్కెట్‌లో కొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 49 శాతం మంది బరువైన, భారీ సెట్ల కన్నా తేలికపాటి (లైట్‌వెయిట్), మినిమలిస్ట్ డిజైన్లకే ఓటు వేశారు. జెన్-జెడ్‌లో 51 శాతం మంది వెండిని, 34 శాతం మంది ప్లాటినంను ఇష్టపడుతున్నారు. ఆధునిక డిజైన్లు, తక్కువ ధర, సులువుగా లభించడం వంటి కారణాలతో దాదాపు 45 శాతం మంది జెన్-జెడ్, మిలీనియల్స్ వెండి ఆభరణాలలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.

గతంలో దేశంలో 70 శాతం నగల కొనుగోళ్లు పెళ్లిళ్ల కోసమే జరిగేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. పుట్టినరోజులు, పెళ్లి రోజులు (38శాతం), ఆఫీసులకు, రోజువారీ వినియోగానికి (32శాతం) కూడా నగలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది.

"భారత నగల మార్కెట్ ఒక కీలక మలుపులో ఉంది. సంపద సృష్టి, రోజువారీ వినియోగం వంటి అంశాలు కొనుగోళ్లను ప్రభావితం చేస్తున్నాయి. సంప్రదాయాన్ని నిలబెడుతూనే ఆధునిక డిజైన్లను అందించే రిటైలర్లు భవిష్యత్తులో రాణిస్తారు" అని డెలాయిట్ ఇండియా భాగస్వామి ప్రవీణ్ గోవిందు వివరించారు. డిజిటల్ ప్రభావం పెరుగుతున్నప్పటికీ, నమ్మకం ప్రధానం కావడంతో ఫిజికల్ స్టోర్ల ప్రాధాన్యం తగ్గలేదని నివేదిక స్పష్టం చేసింది.
Deloitte India Report
Indian jewelry market
gold investment
jewelry trends
GenZ jewelry
millennials jewelry
silver jewelry
platinum jewelry
fashion trends
jewelry purchase reasons

More Telugu News