IMD: దక్షిణాది రాష్ట్రాలకు పొంచి ఉన్న 'వాయు'గండం ..ఏపీలోని నాలుగు జిల్లాలపై ప్రభావం

IMD warns of Cyclone Vayu threat to South India heavy rains expected
  • చెన్నైకి 1,140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం 
  • శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీలంకతో పాటు తమిళనాడులో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ
  • శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడి
దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలిస్తే ఇది తుపానుగా మారే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో భూమధ్యరేఖ సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయానికి వాయుగుండంగా బలపడి సాయంత్రానికి ఇది పొట్టువిల్‌ (శ్రీలంక)కు 570 కిలోమీటర్లు, బట్టికోలోవా (శ్రీలంక)కు 620 కిలోమీటర్లు, కరైకల్‌ (తమిళనాడు)కు 990 కిలోమీటర్లు, చెన్నైకి 1,140 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది.

ఇది ఈ రోజు (గురువారం) తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అనంతరం 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీలంకతో పాటు తమిళనాడు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండం ప్రభావం నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు తుపాను హెచ్చరికల కేంద్రం ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేసింది. 
IMD
South India Cyclone
Cyclone Vayu
Tamil Nadu rains
Andhra Pradesh rains
Sri Lanka weather
Weather forecast
Bay of Bengal depression
Heavy rainfall warning
AP disaster management

More Telugu News