Bihar Gold Shops: ముసుగుతో వచ్చే వారికి ఆభరణాలు విక్రయించకూడదని బీహార్‌లో బంగారం వ్యాపారుల నిర్ణయం

Bihar Gold Shops Ban Sales to Masked Customers
  • బీహార్ రాష్ట్రంలో అమలు చేయడం ఇదే మొదటిసారి
  • బంగారం దుకాణాలలో నేరాలను నిరోధించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఆర్జేడీ
బీహార్‌లోని ఆభరణాల దుకాణాల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మాస్కులు, హిజాబ్‌లు, నిఖాబ్‌లు, హెల్మెట్‌లు ధరించి ముఖాలను కప్పుకుని వచ్చే కస్టమర్లకు తమ దుకాణాల్లో ప్రవేశం నిరాకరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారి. బంగారం దుకాణాలలో నేరాలను నిరోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుకాణాల యజమానులు తెలిపారు. అయితే, ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఒక నిర్దిష్ట సమాజం యొక్క మతపరమైన భావాలపై దాడి అని ఆరోపిస్తోంది.

ముఖం కప్పుకుని వచ్చే కస్టమర్లకు ఆభరణాలు చూపించకూడదని, విక్రయించకూడదని బీహార్ రాష్ట్ర ఆల్ ఇండియా జ్యువెల్లర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ విభాగం నిర్ణయించింది. వినియోగదారులు, యజమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఫెడరేషన్ విభాగం అధ్యక్షుడు అశోక్ కుమార్ వర్మ వెల్లడించారు.

ముఖాలకు ముసుగులు ధరించి వచ్చే వారిని గుర్తించడం కష్టమని, ఏదైనా దొంగతనం జరిగినప్పుడు సీసీటీవీ ఫుటేజీ సాయంతో గుర్తు పట్టేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ముఖాలు కనిపించకుండా దుకాణాల్లోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా అనేకం చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. గత ఏడాది మార్చిలో ఇదే తరహాలో వచ్చిన కొందరు దొంగలు భోజ్‌పురి జిల్లాలోని ఒక దుకాణంలో రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను చోరీ చేశారు. నవంబర్ నెలలో కూడా సివాన్ నగరంలో ఇలాంటి దోపిడీ జరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు.
Bihar Gold Shops
Gold theft
jewelry shop robbery
Bihar crime
mask ban
hijab ban
niqab ban

More Telugu News