Venkateswara Swamy Temple: కేపీహెచ్‌బీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ
- సర్దార్ పటేల్ నగర్‌లో ఉన్న ఆలయంలో చోరీ
- అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు
- రూ. 50 లక్షల విలువైన వెండి ఆభరణాల చోరీ
హైదరాబాద్ నగరంలో మరోసారి ఆలయ చోరీ ఘటనతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి వేళలో దుండగులు గుడి లోపలికి చొరబడి, గర్భగుడి తాళాలను పగులగొట్టి స్వామివారి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లిపోయారు. ఈ నగల విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ దారుణ ఘటన ఉదయం గుడి తెరిచిన తర్వాతే బయటపడింది. గుడి సిబ్బంది, స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు తక్షణమే ఆలయానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు ఎలా లోపలికి వచ్చారు, ఏ మార్గంలో పారిపోయారు అనే అంశాలపై క్లూస్ సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి, డాగ్ స్క్వాడ్‌ను కూడా రంగంలోకి దింపారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలను త్వరలోనే కనిపెడతామని తెలిపారు. హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో ఆలయాల్లో చోరీలు పెరిగిపోతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల చుట్టూ మెరుగైన భద్రత, సీసీ కెమెరాలు, రాత్రి వేళలో గస్తీని పెంచాలని కోరుతున్నారు.