Bengaluru-Vijayawada Expressway: విజయవాడ-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌వే.. ఏపీలో ఎన్‌హెచ్ఏఐ రెండు గిన్నిస్ రికార్డులు

NHAI sets two Guinness World Records in construction of Bengaluru Vijayawada Expressway
  • 24 గంటల్లో 28.95 లేన్-కిలోమీటర్ల బీటీ రోడ్డు వేసి అరుదైన ఘనత
  • ఇది భారత్, ఏపీకి గర్వకారణమని సీఎం చంద్రబాబు వ్యాఖ్య
  • ఈ మార్గంతో సగానికి తగ్గనున్న‌ అమరావతి-బెంగళూరు ప్రయాణ సమయం
బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో భాగంగా ఏపీలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించింది. ఇది భారత్‌కు, ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. 

"బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ (NH-544G)లో M/s రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా NHAI 24 గంటల్లోనే 28.95 లేన్-కిలోమీటర్ల పొడవున, 10,675 మెట్రిక్ టన్నుల తారు కాంక్రీట్‌ను నిరంతరాయంగా వేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది" అని సీఎం చంద్రబాబు 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు. 

కేంద్ర ప్రభుత్వ దార్శనికత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో ప్రపంచస్థాయి రహదారుల నిర్మాణం, ఇంజినీర్లు, కార్మికుల అసాధారణ నిబద్ధత వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన కొనియాడారు. ఇదే కారిడార్‌లోని ఇతర ప్యాకేజీలలో 2026 జనవరి 11 నాటికి మరో రెండు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

భారత్‌మాల ఫేజ్-II కింద చేపట్టిన ఈ ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం ఇటీవల వేగం పుంజుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి బెంగళూరుకు ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 11-12 గంటల నుంచి సుమారు 6 గంటలకు తగ్గనుంది. ఈ రహదారి ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది.

మొత్తం 518 నుంచి 624 కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిని సుమారు రూ.19,200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇందులో కోడికొండ నుంచి అద్దంకి/ముప్పవరం వరకు 342 కిలోమీటర్ల భాగం పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ కాగా, మిగిలిన భాగాన్ని బ్రౌన్‌ఫీల్డ్ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఏపీ కనెక్టివిటీకి, సరుకు రవాణాకు కీలకం కానుంది.
Bengaluru-Vijayawada Expressway
Chandrababu Naidu
NHAI
Guinness World Record
Andhra Pradesh
Nitin Gadkari
expressway construction
greenfield project
Bharatmala project
economic corridor

More Telugu News