Kamineni Srinivas Rao: ఇకపై పోటీ చేయను.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: కామినేని శ్రీనివాసరావు
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనన్న కామినేని
- రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎప్పుడో ఆలోచించానని వెల్లడి
- రాజకీయాలకు అతీతంగా పని చేసి పేరు తెచ్చుకుంటానని వ్యాఖ్య
ఏపీ బీజేపీ సీనియర్ నేత, కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఎప్పుడో అనుకున్నానని, కానీ అందరూ కోరుకోవడంతో పాటు బలవంతం చేయడంతోనే 2024 ఎన్నికల్లో పోటీ చేశానని ఆయన అన్నారు. అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
తాను కానీ, తన కుటుంబంలో, ఎవరూ కానీ ఇకపై ఎన్నికల్లో పోటీ చేయబోమని కామినేని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా మంచి పనులు చేసి, సమాజానికి ఉపయోగపడేలా పేరు తెచ్చుకుంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... నియోజకవర్గంలో అక్రమాలు, అన్యాయాలు జరిగితే ఎవరినీ ఉపేక్షించబోమని కఠిన హెచ్చరిక కూడా చేశారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు కామినేని శ్రీనివాసరావు మంచి సందేశం ఇచ్చారు. పండుగలో జూదాలు ఆడటం మానేసి, మన సంప్రదాయ క్రీడలే ఆడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ‘జూదాలు వద్దు – సంప్రదాయ క్రీడలే ముద్దు’ అనే నినాదం కూడా ఇచ్చారు.