Mithali Raj: ఏసీఏ ఉమెన్ టీమ్ మెంటార్‌గా మిథాలీ రాజ్: ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్

Mithali Raj Named ACA Womens Team Mentor Kesineni Srinath
  • ఏడాది కాలంలో ఏసీఏను గణనీయంగా అభివృద్ధి చేశామన్న అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌
  • విశాఖ స్టేడియాన్ని పూర్తిగా పునరుద్దరించామని వెల్లడి
  • త్వరలో మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయనున్నామన్న కేశినేని శివనాథ్
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)ను ఏడాది కాలంలో గణనీయంగా అభివృద్ధి చేశామని అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేర్కొన్నారు. విజయవాడలో ఏసీఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్‌ను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ సెక్రటరీ సానా సతీశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, విశాఖపట్నం స్టేడియాన్ని పూర్తిగా పునరుద్ధరించామని, ఏ గ్రౌండ్‌తో పాటు బీ గ్రౌండ్‌లో కూడా రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖ స్టేడియంలో కుర్చీలను మారుస్తున్నామని చెప్పారు. అలాగే, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ఏసీఏ ఉమెన్ టీమ్ మెంటార్‌గా నియమించబోతున్నామని అధికారికంగా ప్రకటించారు.

ఏసీఏ చరిత్రలో ఈ ఏడాది జరిగినన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు కూడా విజయవంతంగా నిర్వహించామని, మహిళా క్రికెటర్ల పేర్లతో రెండు గేట్‌లకు నామకరణం చేశామని వెల్లడించారు. త్వరలో మహిళా క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మంగళగిరి స్టేడియాన్ని స్పోర్ట్స్ సెంటర్‌గా అభివృద్ధి చేయనున్నామని, బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తరహాలో మూలపాడును అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. కడప స్టేడియంలో మౌలిక వసతులు మెరుగుపరచి కొత్త రూమ్స్ నిర్మించనున్నామని వెల్లడించారు.

గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడానికి ‘రూరల్ టాలెంట్ సెర్చ్’ కార్యక్రమం ద్వారా కోచింగ్ క్యాంప్‌లు నిర్వహిస్తామని, ఆంధ్ర టీమ్‌కు విదేశీ కోచ్‌ను నియమించబోతున్నామని తెలిపారు. ప్రపంచ కప్ సమయంలో మహిళా క్రికెటర్లను మంత్రి నారా లోకేశ్ ప్రోత్సహించారని, అదే టీమ్ ప్రపంచ కప్ గెలవడం ఆనందంగా ఉందని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

ఏసీఏ సెక్రటరీ సానా సతీశ్ మాట్లాడుతూ, న్యూజిలాండ్‌కు చెందిన గ్యారీ స్టీడ్‌ను ఏసీఏ కోచ్‌గా నియమించబోతున్నామని తెలిపారు. మిథాలీ రాజ్‌ను ఉమెన్ టీమ్ మెంటార్‌గా నియమించనున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా పారదర్శకతతోనే ముందుకు వెళ్తున్నామని అన్నారు. అండర్-14 టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. క్రికెట్ అసోసియేషన్లకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచుతున్నామని, కొత్త క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సానా సతీశ్ వెల్లడించారు. 
Mithali Raj
ACA
Andhra Cricket Association
Kesineni Srinath
Womens Cricket
Indian Cricket
Cricket Academy
Sana Satish
Womens World Cup
Gary Stead

More Telugu News