Chiranjeevi: 'మన శంకరవరప్రసాద్ గారు' సందడి షురూ.. భారీ ధరకు తొలి టికెట్ కొన్న అభిమాని
- ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మెగాస్టార్ సినిమా
- నయన్ కథానాయికగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న భారీ చిత్రం
- అమలాపురంలో తొలి టికెట్‌ను రూ. 1.11 లక్షలకు సొంతం చేసుకున్న అభిమాని
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించారు. సినిమా విడుదలకు కొన్ని రోజులే ఉండటంతో ఇప్పటికే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. చాలా చోట్ల టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి.
ఈ క్రమంలో, కోనసీమ జిల్లా అమలాపురంలోని వెంకటరమణ థియేటర్‌లో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి యువత అభిమాన సంఘం ఆధ్వర్యంలో ప్రీమియర్ షో మొదటి టికెట్ కోసం వేలం నిర్వహించారు. ఈ వేలంలో మెగా అభిమాని, జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బారావు పాల్గొని, ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను ఏకంగా 1.11 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు అందజేస్తామని అభిమాన సంఘం నాయకులు తెలిపారు. తనకు తొలి టికెట్ దక్కడంపై సుబ్బారావు సంతోషం వ్యక్తం చేశారు.
ఇక సినిమా విషయానికి వస్తే, చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రోమోలు, పాటలు, ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినిమాపై హైప్ రోజురోజుకూ పెరిగిపోతోంది. సినిమాకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. మొత్తం నిడివి 2 గంటల 42 నిమిషాలు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ ఒక గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.
సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ రోజు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుండటంతో ఇప్పటికే అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.