Cab Driver: క్యాబ్ డ్రైవర్ పై మహిళ జులుం.. డబ్బులు అడిగితే వేధింపుల కేసు పెడతానని బెదిరింపు

Gurugram Woman Threatens With Molestation Case
  • క్యాబ్ బుక్ చేసుకుని రైడ్ పూర్తయ్యాక డబ్బులు ఇవ్వకుండా రచ్చ
  • మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేసిన క్యాబ్ డ్రైవర్
  • చీటింగ్ కేసు నమోదు చేసిన గురుగ్రామ్ పోలీసులు
గురుగ్రామ్ లో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ మహిళ గంటల తరబడి వివిధ ప్రదేశాలకు తిరిగింది. మధ్యలో క్యాబ్ డ్రైవర్ దగ్గర డబ్బులు తీసుకుని హోటల్ లో తిని తాగింది. చివరకు రైడ్ మొత్తం పూర్తయ్యాక డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగింది. క్యాబ్ లో తనను వేధించావని పోలీస్ కేసు పెడతానని హెచ్చరించింది. దీంతో క్యాబ్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు ఆ మహిళపై చీటింగ్ కేసు నమోదు చేశారు. క్యాబ్ డ్రైవర్ జియావుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం..
 
మంగళవారం ఉదయం జ్యోతి దలాల్ అనే మహిళ తన క్యాబ్ బుక్ చేసుకుందని జియావుద్దీన్ తెలిపాడు. తొలుత సెక్టార్ 31కు, అక్కడి నుంచి బస్టాండ్ కు, ఆపై సైబర్ సిటీకి.. ఇలా వివిధ ప్రాంతాలకు తిరిగిందని చెప్పారు. మధ్యలో ఆకలిగా ఉందని, తనను ఇంటి వద్ద దింపాక ఇస్తానని చెప్పి డబ్బులు అడిగితే రూ.700 ఇచ్చానని వివరించారు. తీరా ఆమెను ఇంటి దగ్గర దింపాక తనను బెదిరింపులకు గురిచేసిందని ఆరోపించాడు.

డబ్బులు అడగకుండా వెళ్లిపోతే సరే.. లేదా క్యాబ్ లో తనను వేధించావని, డబ్బులు దొంగతనం చేశావని పోలీస్ కేసు పెడతానని బ్లాక్ మెయిల్ చేసిందన్నారు. సెక్టార్ 29 పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అక్కడ నానా రచ్చ చేసిందన్నారు. ఆమె వెళ్లిపోయాక పోలీసులకు జరిగిన విషయం మొత్తం వివరించి చెప్పానని అన్నారు. కాగా, జియావుద్దీన్ ఫిర్యాదుతో జ్యోతి దలాల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. గతంలో కూడా ఆమె ఇలాగే ఓ సెలూన్ యజమానిని మోసం చేసిందని తెలిపారు. జ్యోతి దలాల్ ను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.
Cab Driver
Gurugram Woman
Molestation
False Complaint
Cab ride
Jyoti Dalal
Police Case
woman Harasment

More Telugu News