Telangana High Court: భార్య వంట చేయట్లేదని విడాకులు కావాలంటూ భర్త పిటిషన్.. తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే..!

Telangana High Court Rejects Divorce Plea Wife Not Cooking
  • భర్త పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
  • ఉద్యోగం చేసే భార్య ఇంటిపని చేయకపోవడం క్రూరత్వం కాదని వ్యాఖ్య‌
  • బాధ్యతలను సమానంగా పంచుకోవాలని ధర్మాసనం హితవు
భార్య వంట చేయడం లేదనో, ఇంటి పనులు చక్కబెట్టడం లేదనో విడాకులు మంజూరు చేయలేమని తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్థులైనప్పుడు, కేవలం వంట చేయలేదనే కారణాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ తీర్పు ఇస్తున్నట్లు జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇంటి పనులు, వంట చేయకుండా, తన తల్లికి సాయపడకుండా మానసికంగా హింసిస్తోందని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురవడంతో హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, దంపతులిద్దరి పనివేళలను పరిశీలించింది. భర్త మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 గంటల వరకు, భార్య ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించింది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, ఇంటి పనుల విషయంలో ఆరోపణలు చేయడం సహేతుకం కాదని అభిప్రాయపడింది. అంతేకాకుండా గర్భస్రావం తర్వాత కోలుకోవడానికి భార్య పుట్టింటికి వెళ్లడాన్ని క్రూరత్వంగా భావించలేమని స్పష్టం చేసింది.

భర్త ఆరోపణల్లో వైవాహిక బంధాన్ని రద్దు చేసేంత తీవ్రమైన కారణాలు లేవని తేల్చిచెప్పిన హైకోర్టు, అతని అప్పీలును కొట్టివేసింది. ఆధునిక కాలంలో బాధ్యతలను పాతకాలపు ధోరణులతో కాకుండా పరస్పర అవగాహనతో పంచుకోవాలని హితవు పలికింది.
Telangana High Court
Divorce petition
Wife not cooking
Cruelty
LB Nagar
Working couple
Justice Mousumi Bhattacharya
Justice Nagesh Bhimapaka
Matrimonial dispute
Household chores

More Telugu News