Nita Ambani: వరల్డ్ కప్ గెలిచిన భారత అంధ మహిళల జట్టుకు నీతా అంబానీ భారీ నజరానా

Nita Ambani Announces Rs 5 Crore Reward for Indian Blind Womens Team
  • అంధ మహిళా క్రికెట్ జట్టుకు రిలయన్స్ ఫౌండేషన్ రూ.5 కోట్ల నజరానా
  • టీ20 ప్రపంచకప్ గెలిచినందుకు ఈ ప్రత్యేక సత్కారం
  • ముంబైలో 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' పేరుతో జరిగిన వేడుక
  • ఒకే వేదికపై మూడు ప్రపంచకప్ విజేత జట్ల కెప్టెన్లకు గౌరవం
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ చారిత్రక విజయం సాధించిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు భారీ నజరానా ప్రకటించారు. తొలిసారి జరిగిన అంధుల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న జట్టుకు ఫౌండేషన్ తరఫున రూ.5 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేశారు. వారి అద్భుతమైన స్ఫూర్తిని, పట్టుదలను కొనియాడారు.

ముంబైలో 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' పేరుతో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నీతా అంబానీ స్వయంగా జట్టుకు రూ.5 కోట్ల చెక్కును అందించారు. ఈ వేదికపై మూడు ప్రపంచకప్ విజేత జట్లను ఒకేచోట సత్కరించడం విశేషం. అంధ మహిళల జట్టు కెప్టెన్ దీపికతో పాటు, టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన పురుషుల జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా నిలిచిన మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "నూతన సంవత్సరాన్ని ఒక ప్రత్యేకమైన సందర్భంతో ప్రారంభిస్తున్నాం. మూడు భారత క్రికెట్ జట్లు ఒకే గూటి కిందకు రావడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి భారతీయుడి తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వారి విజయాలను వేడుకగా జరుపుకుంటున్నాం" అని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్, ఐసీసీ ఛైర్మన్ జై షాతో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. తమకు అండగా నిలిచినందుకు నీతా అంబానీకి అంధ మహిళా క్రికెటర్లు కృతజ్ఞతలు తెలిపారు. 
Nita Ambani
Indian blind women cricket team
Blind T20 World Cup
Reliance Foundation
Rohit Sharma
Harmanpreet Kaur
Mukesh Ambani
Sachin Tendulkar
Jai Shah
Cricket

More Telugu News