Vijay: విజయ్ చివరి సినిమాకు ఇంకా రాని సెన్సార్ సర్టిఫికెట్.. ఉత్కంఠలో నిర్మాతలు, అభిమానులు
- విడుదలకు సిద్ధమైన విజయ్ 'జన నాయగన్' చిత్రం
- ఈ నెల 9న విడుదల కావాల్సిన చిత్రం
- మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన నిర్మాతలు
తమిళ సూపర్‌స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడుకు జరుగుతున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. మరోవైపు సినిమాల నుంచి తాను వైదొలుగుతున్నట్టు ఇప్పటికే విజయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 9న సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు రిలీజ్‌పై పెద్ద అనుమానాలు రేగాయి. సెన్సార్ బోర్డు నుంచి ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడమే దీనికి కారణం. రిలీజ్‌కి కేవలం 3 రోజులే ఉన్న తరుణంలో ఈ జాప్యం కోలీవుడ్‌లో సంచలనం రేపింది. విజయ్ అభిమానులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు.
డిసెంబర్ 18న సినిమాను సెన్సార్ బోర్డుకు సమర్పించారు. బోర్డు కొన్ని మైనర్ కట్స్, డైలాగ్ మ్యూట్లు సజెస్ట్ చేసింది. నిర్మాతలు వెంటనే అంగీకరించి మార్పులు చేసి మళ్లీ సబ్మిట్ చేశారు. అయినా సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. దీని వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చని విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) వర్గాలు ఆరోపిస్తున్నాయి. TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీటీ నిర్మల్ కుమార్ మాట్లాడితే... "కొన్ని గంటల్లో సర్టిఫికెట్ రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటాం" అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఈ జాప్యం వల్ల తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ నిలిచిపోయాయి. కర్ణాటక, కేరళ, ఓవర్సీస్‌లో మాత్రం బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే ప్రీ-సేల్స్ రూ.35 కోట్లు దాటాయి. సర్టిఫికేట్ లేకపోతే థియేటర్లలో షోలు పడవు. నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుంది.
చివరికి నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఎమర్జెన్సీ పిటిషన్ దాఖలు చేసి, సర్టిఫికెట్ వెంటనే ఇవ్వాలని కోర్టును కోరారు. కోర్టు నుంచి సానుకూల నిర్ణయం వస్తే రేపటి నుంచి బుకింగ్స్ ఊపందుకుంటాయి, అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుంది.