Prithviraj Chavan: మదురో లాగే ప్రధాని మోదీని ట్రంప్ కిడ్నాప్ చేస్తారా?: కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Prithviraj Chavan Will Trump Kidnap Modi Like Venezuela President
  • పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం
  • వెనెజువెలా సంక్షోభంపై మోదీ మౌనంగా ఉన్నారని ఆరోపణ
  • మదురోను కిడ్నాప్ చేసినట్లుగా, మరే దేశాధినేతకైనా ఇలా జరగవచ్చని వ్యాఖ్య
వెనెజువెలాలో నికోలస్ మదురోకు జరిగినట్లుగా భారతదేశంలో కూడా జరుగుతుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రిని కూడా కిడ్నాప్ చేస్తారా? అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్ ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెనెజువెలా అధ్యక్షుడిగా ఉన్న మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ, వెనెజువెలా సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఎన్నికైన అధ్యక్షుడిని తొలగించినప్పటికీ భారత్ మౌనంగా ఉందని అన్నారు. అమెరికా చర్యలు ప్రపంచానికి చెడు సంకేతాన్ని అందిస్తాయని అన్నారు.

వెనెజువెలాలో ఎన్నికైన అధ్యక్షుడిని కిడ్నాప్ చేశారని, రేపు మరే దేశాధినేతకైనా ఇలా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారతదేశానికి కూడా జరగవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ప్రపంచంలోని వివిధ సంఘర్షణలపై భారత ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకోవడంలో విఫలమైందని చవాన్ ఆరోపించారు. రష్యా, చైనాలు ఏదో ఒక వైఖరిని తీసుకున్నాయని వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల విషయంలోనూ భారత్ స్పష్టమైన వైఖరిని చెప్పలేకపోయిందని ఆరోపించారు. మనం అమెరికాకు భయపడుతున్నట్లుగా ఉందని అన్నారు.

మదురో అమెరికాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వెనెజువెలా ఆయిల్ నిల్వలే కిడ్నాప్‌కు ప్రధాన కారణమని అనుమానం వ్యక్తం చేశారు. మనం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నా, భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు కావాలన్నా ప్రపంచ అంశాలపై స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని అన్నారు.

భారతదేశ ఉత్పత్తులపై అమెరికా అధిక వాణిజ్య పన్నులు విధించడాన్ని పృథ్వీరాజ్ చవాన్ తప్పుబట్టారు. మన ఎగుమతులపై ప్రత్యక్ష నిషేధం విధించలేక, వాణిజ్యాన్ని ఆపేందుకు సుంకాలను ట్రంప్ ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమెరికాకు ఎగుమతులు చేయడం ద్వారా గతంలో ఆర్జించిన లాభాలు ఇప్పుడు రావని, మనం ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాలని అన్నారు.

పృథ్వీచవాన్ వ్యాఖ్యలు దారుణం

పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలపై జమ్ము కశ్మీర్ మాజీ పోలీసు అధికారి ఎస్పీ వైద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడి వ్యాఖ్యలు దేశాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. పృథ్వీరాజ్ చవాన్ బ్రెయిన్ డెడ్ అయిందని, నిరక్షరాస్యుడని, మూర్ఖుడంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

మదురోకు ట్రంప్ చేతిలో ఎదురైన అనుభవమే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా జరగాలని కాంగ్రెస్ నేత చవాన్ కోరుకోవడం దేశాన్ని అవమానించడమేనని వైద్ అన్నారు. పృథ్వీరాజ్ చవాన్ కనీసం మాట్లాడే ముందు ఆలోచన చేయాల్సిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అసలు భావజాలం ఇదేనా, ఇప్పుడు వారి రంగు బయటపడుతోందని అన్నారు.
Prithviraj Chavan
Narendra Modi
Donald Trump
Venezuela crisis
India US relations
Congress party

More Telugu News