Katipally Venkata Ramana Reddy: మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఈవీలనే ఉపయోగించాలి: కాటిపల్లి వెంకటరమణారెడ్డి

Katipally Venkata Ramana Reddy Urges EV Use for Ministers MLAs and Officials
  • కాలుష్యం తగ్గాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలన్న కాటిపల్లి
  • ఈవీల వినియోగం పెంచేందుకు కేంద్రం సబ్సిడీ ఇస్తోందని వెల్లడి
  • రోడ్ ట్యాక్స్, వెహికిల్ ట్యాక్స్ మినహాయిస్తూ ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచన
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కీలక సూచనలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) వినియోగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. కాలుష్యం తగ్గాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తోందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా ప్రోత్సాహకాలు అందిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. ఛార్జింగ్ స్టేషన్ల కొరత కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈవీల వినియోగం తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో ప్రస్తుతం కేవలం 70 వేల ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. రోడ్ ట్యాక్స్, వెహికిల్ ట్యాక్స్ మినహాయింపు వంటి ప్రోత్సహకాలను ప్రభుత్వం అందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈవీలను ఉపయోగించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని బీజేపీకి చెందిన మరో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చాలంటే ఈవీల వినియోగం తప్పనిసరి అని ఆయన అన్నారు. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున సబ్సిడీలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, పార్కింగ్ స్థలాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
Katipally Venkata Ramana Reddy
electric vehicles
EV
Telangana Assembly
pollution reduction

More Telugu News