Yuvraj Singh: పీటర్సన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆనాటి భయానక అనుభవాలను గుర్తు చేసుకున్న యువరాజ్ సింగ్
- క్యాన్సర్‌ను జయించిన విజేత యువరాజ్ సింగ్
- 3 నుంచి 6 నెలలే బతుకుతావని డాక్టర్లు చెప్పారన్న యువీ
- 2011 వరల్డ్ కప్ గెలుపులో కీలకపాత్ర పోషించిన యువరాజ్ సింగ్
టీమ్ ఇండియా లెజెండ్ యువరాజ్ సింగ్ క్యాన్సర్‌తో పోరాడి జయించిన కథ అందరికీ తెలిసిందే. 2011 వరల్డ్ కప్‌లో క్యాన్సర్ బాధలతోనే ఆడి, జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ యూట్యూబ్ ఛానల్ The Switch కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ తన ఆ రోజుల భయానక అనుభవాలను మళ్లీ గుర్తు చేసుకున్నాడు.
యువరాజ్ మాట్లాడుతూ... "డాక్టర్లు నాకు 3 నుంచి 6 నెలలే బతుకుతానని చెప్పారు. ట్యూమర్ నా ఊపిరితిత్తి, గుండె మధ్యలో ఉంది. కీమోథెరపీ చేయకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు" అని తెలిపాడు.
"నేను దాదాపు 7 సంవత్సరాలు వేచి చూశాను. 40 టెస్టులకు 12వ ఆటగాడిగా ఉన్న తర్వాత టెస్ట్ క్రికెట్‌లో స్థానం సుస్థిరం చేసుకోవాలనుకున్నా. కానీ చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. నా ముందు మార్గం లేకపోయింది" అని యువీ వివరించాడు. యూవీ 2011-2012లో అమెరికాలో కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆ రోజుల్లో డాక్టర్ లారెన్స్ ఐన్‌హార్న్ మాటలు తనకు బలం ఇచ్చాయని యువీ చెప్పాడు. "నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి వెళతావని డాక్టర్ చెప్పారు. ఆ మాటలు నాకు ధైర్యం ఇచ్చాయి. క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ క్రికెట్ ఆడగలనని చెప్పినప్పుడు అది పునర్జన్మలా అనిపించింది" అని ఎమోషనల్ అయ్యాడు.
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత యువరాజ్ మైదానంలో అద్భుతాలు చేశాడు. 2013లో ఆస్ట్రేలియాతో టీ20లో 35 బంతుల్లోనే 77 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడ, 2017లో ఇంగ్లండ్‌పై కటక్‌లో వన్డేలో తన అత్యధిక స్కోర్ 150 పరుగులు చేశాడు. అదే ఏడాది వెస్టిండీస్ టూర్‌లో చివరిసారి ఆడాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యాడు. ఈ ఇంటర్వ్యూ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువరాజ్ పోరాటం ఎంతమందికో ఇన్‌స్పిరేషన్! 