Donald Trump: ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటే.. నాటో అంతమయినట్టే: డెన్మార్క్ పీఎం
- గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్
- 20 రోజుల్లో గ్రీన్‌లాండ్ గురించి మాట్లాడదామని వ్యాఖ్య
- తమ రాజ్యంలోని భూభాగాన్ని ఆక్రమించే హక్కు అమెరికాకు లేదన్న డెన్మార్క్ పీఎం
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను, ఆయన భార్యను యూఎస్ డెల్టా ఫోర్సెస్ బందీ చేసి అమెరికాకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలోని డిటెన్షన్ సెంటర్ లో ఉన్నారు. వెనెజువెలా తర్వాత ఇప్పుడు గ్రీన్‌లాండ్ పేరు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "గ్రీన్‌లాండ్ మనకు జాతీయ భద్రత కోసం అవసరం" అని మరోసారి చెప్పారు. "ఇంకో 20 రోజుల్లో గ్రీన్‌లాండ్ గురించి మాట్లాడదాం" అంటూ మరో రచ్చకు శ్రీకారం చుట్టారు.
ఈ నేపథ్యంలో డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ తీవ్రంగా స్పందించారు. "అమెరికా గ్రీన్‌లాండ్‌ను తీసుకోవాలని మాట్లాడటం అర్థరహితం. మా రాజ్యంలోని ఏ భాగాన్నీ అమెరికా ఆక్రమించే హక్కు లేదు" అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరీ తీవ్రంగా, "అమెరికా నాటో సభ్యదేశంపై దాడి చేస్తే అంతా ఆగిపోతుంది... నాటో కూడా ముగిసిపోతుంది" అని వార్నింగ్ ఇచ్చారు.
కలకలం రేపిన మరో విషయం ఏమిటంటే... ట్రంప్ సీనియర్ అడ్వైజర్ స్టీఫెన్ మిల్లర్ భార్య కేటీ మిల్లర్ సోషల్ మీడియాలో గ్రీన్‌లాండ్ మ్యాప్‌ను అమెరికన్ ఫ్లాగ్ రంగుల్లో పోస్ట్ చేసి "SOON" (త్వరలో) అని క్యాప్షన్ పెట్టారు. ఇది అంతర్జాతీయంగా దుమారం రేపింది.

గ్రీన్‌లాండ్ డెన్మార్క్‌దే అనడానికి ఆధారం ఏమిటి?
చరిత్రలో 1721 నుంచి డెన్మార్క్ కాలనీగా గ్రీన్‌లాండ్ ఉంది. ప్రస్తుతం స్వయం ప్రతిపత్తి (ఆటానమస్) ఉన్నా, విదేశాంగం, డిఫెన్స్ తదితర అంశాలు డెన్మార్క్ చూసుకుంటుంది. గ్రీన్‌లాండ్‌ను కొంటామని 2019లోనే ట్రంప్ ప్రతిపాదించారు, కానీ "గ్రీన్‌లాండ్ అమ్ముడు పోదు" అని డెన్మార్క్ తిరస్కరించింది.
నాటో విషయానికి వస్తే... 1949లో సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకోవడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్, కెనడా సహా 12 దేశాలు కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. ఇప్పుడు 30కి పైగా సభ్య దేశాలు ఉన్నాయి.

