Vadde Katamaiah: సైబర్ క్రైం సంబంధిత కోర్సులు నేర్చుకోవడానికి వచ్చి ఏటీఎంలలో చోరీ

Cyber Crime Student Vadde Katamaiah Caught Stealing from ATM
  • హైదరాబాద్ లో దొంగతనం చేస్తున్న అనంతపురం వాసి
  • ఏటీఎంలో నగదు కొట్టేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు
  • కోర్సులో నేర్చుకున్న పాఠాలను దొంగతనానికి వాడిన యువకుడు
సైబర్ క్రైమ్ సంబంధిత కోర్సుల్లో కోచింగ్ తీసుకుని ఉపాధి పొందేందుకు హైదరాబాద్ వచ్చిన అనంతపురం యువకుడు వక్రమార్గం పట్టాడు. కోర్సులో భాగంగా చెప్పిన పాఠాలతో నేర్చుకున్న పరిజ్ఞానాన్ని దొంగతనాలకు వాడాడు. ఏటీఎంల పనితీరుపై అవగాహన పెంచుకుని స్మార్ట్ గా చోరీ చేద్దామని ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
 
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన వడ్డే కాటమయ్య సైబర్ క్రైమ్ సంబంధిత కోర్సులు నేర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చాడు. ఈ కోర్సుల్లో భాగంగా చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్న కాటమయ్య.. ఏటీఎంల పనితీరుపై మరింత అవగాహన పెంచుకున్నాడు. ఆపై కాపలా లేని ఏటీఎంలను ఎంచుకుని దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం అర్ధరాత్రి తర్వాత మియాపూర్ లోని ఓ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించాడు.

ఏటీఎం మెషిన్ లో ఓ పరికరాన్ని ఉంచి నగదు బయటకు రాకుండా అడ్డుకున్నాడు. ఏటీఎంలో నగదు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించిన కస్టమర్.. ఈ పరికరం కారణంగా నగదు బయటకు రాకపోవడంతో ట్రాన్సాక్షన్ ఫెయిలైందని భావించి మరో ఏటీఎంను వెతుక్కుంటూ వెళతారు. ఆ తర్వాత ఆ పరికరాన్ని తొలగించి నగదు కాజేయాలని కాటమయ్య ప్రయత్నించాడు. కాటమయ్య అనుమానాస్పద తీరును చూసి ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కాటమయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు.

ఏటీఎంలో చోరీ చేయడానికి ప్రయత్నించానని అంగీకరించడంతో అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కాగా, ఈ చోరీ ప్రయత్నంలో కాటమయ్యకు మరో యువకుడు సహకరించాడని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
Vadde Katamaiah
Cyber Crime
ATM theft
Hyderabad
Anantapur
Miyapur
ATM Machine
Crime
Andhra Pradesh

More Telugu News