Manager: తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే షెల్టర్ హోంలో చేర్చి ఆఫీసుకు రమ్మన్న మేనేజర్

Manager Suggests Employee Put Sick Mother in Shelter Home
  • మేనేజర్ జవాబుతో ఉద్యోగానికి రాజీనామా చేసిన మహిళ
  • రెడిట్ లో వైరల్ గా మారిన పోస్ట్
  • ఇంత అమానవీయంగా ఎలా ఉంటారంటున్న నెటిజన్లు
అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకోవడానికి కొన్నిరోజులు సెలవు కావాలని కోరిన ఉద్యోగికి మేనేజర్ వింత సలహా ఇచ్చాడు. ‘మీ తల్లిగారిని ఆసుపత్రిలోనో లేక ఏదైనా షెల్టర్ హోంలోనో చేర్చి ఆఫీసుకు వచ్చేయండి’ అని చెప్పాడు. ఈ సమాధానంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ ఉద్యోగి అక్కడికక్కడే రాజీనామా లేఖ రాసిచ్చి వెళ్లిపోయింది. మేనేజర్ తీరును ఎండగడుతూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఓ యూజర్ రెడిట్ లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్టు వివరాల్లోకి వెళితే..

ఓ ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్న మహిళ ఇటీవల సెలవు కావాలని మేనేజర్ కు విజ్ఞప్తి చేసింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే, సదరు మేనేజర్ మాత్రం సెలవు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇదే కారణంతో ఇప్పటికే పలుమార్లు సెలవు పెట్టారని, మీ తల్లి అనారోగ్యం నుంచి కోలుకోకపోతే ఏదైనా షెల్టర్ హోంలో చేర్పించాలని ఉచిత సలహా ఇచ్చాడు.

మేనేజర్ తీరుతో కంగుతిన్న ఆ మహిళా ఉద్యోగి గత్యంతరం లేక అప్పటికప్పుడే రాజీనామా చేసింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఆ ఉచిత సలహా ఇచ్చిన మేనేజర్ ను అదే జవాబును రాతపూర్వకంగా ఇవ్వాలని అడగాల్సిందని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. రాజీనామా చేయాల్సింది కాదు.. బ్యాంకు వాళ్లే ఉద్యోగం తొలగించేదాకా ఉండాల్సిందని మరొకరు కామెంట్ చేశారు.
Manager
Employee
Leave request
Mother illness
Shelter home
Job resignation
Viral post
Reddit
Private bank
Employee rights

More Telugu News